చిరంజీవి జేబుదొంగ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘బాసూ.. నీ పేరు ఆంధ్ర దేశమంతా మోగిపోతోంది’ అని చిరంజీవితో భానుప్రియ అంటుంది. చిరంజీవి మేనియా నడుస్తున్న దశలో ఆయన ఇమేజ్, క్రేజ్ అది. చిరంజీవి సినిమా రిలీజ్ అంటే పండగే. ఆయన ఎటువంటి సబ్జెక్ట్ చేస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూసే సమయంలో అత్త-అల్లుడు మధ్య ఆధిపత్య పోరు నడిచే కథతో సినిమా అనుకున్నారు. ఆ సినిమానే ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’. నువ్వా-నేనా అనేస్థాయిలో ఉండే స్క్రీన్ ప్లేతో సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించి, ఉత్సుకతకు గురి చేసిని సినిమా ఇది. సినిమాలో చిరంజీవి స్టైల్, డ్యాన్సులు, ఫైట్లు కొత్తగా డిజైన్ చేశారు. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనమే సృష్టించింది.
నువ్వా-నేనా అన్నట్టు..
డబ్బుందనే అహంకారంతో తన కుటుంబాన్ని అవమానించిన మహిళకు అల్లుడై బుద్ధి చెప్పే కల్యాణ్ పాత్రలో చిరంజీవి నటించారు. పొగరుబోతు అత్తగా మేటి నటి వాణిశ్రీ నటించారు. ఇద్దరి మధ్యా వచ్చే చాలెంజింగ్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. చిరంజీవి-విజయశాంతి కాంబినేసన్లో మరో సూపర్ హిట్ గా నిలిచింది.పకడ్బందీ స్క్రీన్ ప్లే ఇందుకు బాగా దోహదపడింది. సినిమాకు మరో మేజర్ హైలైట్ చక్రవర్తి సంగీతం. ఎప్పటిలా చిరంజీవి అనేసరికి వెయ్యి ఓల్టుల విద్యుత్ జనరేట్ అయిందా అన్నట్టు పాటలు ఇచ్చారు. వీటికి చిరంజీవి రెచ్చిపోయి చేసిన డ్యాన్సులకు ధియేటర్లు మోతెక్కిపోయాయి. ముఖ్యంగా సినిమా మధ్యలో వచ్చే ‘మెరుపులా..’ అనే చిరంజీవి సోలో సాంగ్ ఆయన కెరీర్ బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. మెలికలు తిరిగిపోతూ చిరంజీవి వేసిన స్టెప్స్ ఔరా అనిపిస్తాయి.
వరుసగా మూడో ఇండస్ట్రీ హిట్..
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై లక్కీ డైరక్టర్ ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మించారు. 1989 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలై చిరంజీవికి వరుసగా మూడో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవిని విజయశాంతి పోలీసులకు పట్టించిన తర్వాత ఆమె హాస్టల్ వెళ్లి ‘నా ముక్కు మీద వేలు పెట్టి పోలీసులకు పట్టిస్తావా..’ అనే కామెడీ సన్నివేశం మెప్పిస్తుంది. రావుగోపాలరావు-అల్లు రామలింగయ్య కామెడీ ట్రాక్ సినిమాకు మరో హైలైట్. 41 కేంద్రాల్లో 100 రోజులు ఆడి.. కొన్ని సెంటర్లలో 175 రోజులు రన్ అయింది. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఘనంగా శతదినోత్సవ వేడుకలు నిర్వహించారు. తమిళంలో రజినీకాంత్ తో మాపిళ్లైగా గీతా ఆర్ట్స్ రీమేక్ చేయగా చిరంజీవి అతిథిపాత్రలో నటించారు.