యజ్ఞ యాగాలు చేస్తే కుటుంబంలో చికాకులు తొలగుతాయని చాలా మంది విశ్వాసం. కెసిఆర్, జగన్ లు కూడా స్వామి స్వరూపానంద ఆధ్వర్యంలో రాజశ్యామల యాగాలు నిర్వహించి మంచి ఫలితాలు పొందారు. కాగా, మెగాబ్రదర్స్ ముగ్గురూ సంయుక్తంగా ‘యాగం’ చేస్తే.. ఇబ్బందులు తొలిగిపోయి.. ప్రశాంతత చేకూరుతుందని.. సన్నిహితులు ఇచ్చిన సలహాను ఆచరణలో పెట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం!
మెగాస్టార్ చిరంజీవికి దేవుడి పట్ల విశ్వాసం వుంది. అలాగే పవన్ కళ్యాణ్ కు వుంది. అయితే నాగబాబుకు దేవుడి పట్ల నమ్మకం లేకపోయినా.. తన ఇంట్లో జరిగే పూజలకు అభ్యంతరం పెట్టరు. ఇటీవల నాగబాబు ఎన్నికల్లో ఓటమిపాలుకావడం , వరుణ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తృటిలో తప్పించుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో.. ముగ్గురు అన్నదమ్ములు కలిసి ‘యాగం’ చేస్తే బావుంటుందన్న ప్రతిపాదనను మెగాస్టార్ చిరంజీవి సీరియస్ గా పరిగణిస్తున్నారని సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.
అన్ని కలిసి వస్తే ఆగష్టు మాసంలో ‘యాగం’ ఉండవచ్చునని అంటున్నారు. ‘సైరా’ షూటింగ్ జరిగిన కోకాపేట ఫామ్ హౌస్ లోనే జరగచ్చునని అంటున్నారు . ‘సైరా’ సినిమా షూటింగ్ సెట్ కు అగ్నిప్రమాదం జరిగిన సంగతి కూడా తెలిసిందే. అనామకులు తమ పేరు చెప్పుకొని అందలాలు ఎక్కగా.. హిమాలయ పర్వతం ఎత్తున వున్న తాము అగాథంలో పడటంలా.. ఇటీవల ఎన్నికల ఫలితాలు రావడం.. పవన్ కళ్యాణ్, నాగబాబులకు నిరాశ కలిగించాయి. లోపం ఎక్కడో తెలియని పరిస్థితుల్లో.. దేవుడి పేరిట చేసే యాగాలు కొంత స్వాంతన చేకూర్చే అవకాశం వుంది.