ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇటీవల కాకినాడ పోర్టు నుంచి స్మగుల్ అవుతున్న రేషన్ బియ్యం విషయమై ‘సీజ్ ది షిప్’ అంటూ నినదించిన జనసేనాని పవన్ కళ్యాణ్, అదే విషయమై ఏపీ సీఎంతో చర్చించినట్లు ఇరు పార్టీలకు చెందిన నేతలు చెబుతున్నారు.
మరోపక్క, అటు ప్రభుత్వానికి సంబంధించిన పాలనా పరమైన అంశాలతోపాటు, ఇరు పార్టీలకు సంబంధించిన అంతర్గత రాజకీయ అంశాలు కూడా పవన్ కళ్యాణ్ – చంద్రబాబు భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
మహిళలు, బాలికల భద్రత అంశం విషయమై హోం శాఖ మీద తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై, టీడీపీలో ఓ వర్గం గుస్సా అవడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం తెలిసిన విషయమే.
తాజాగా, ‘సీజ్ ది షిప్’ వ్యవహారంలోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని టీడీపీ శ్రేణులు (ఓ వర్గం) ట్రోల్ చేయడం చూశాం. ఇదంతా పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారంగా జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.
టీడీపీ – బీజేపీ – జనసేన పొత్తులో వున్న దరిమిలా, పొత్తుకి విఘాతం కలిగించేలా వైసీపీ వ్యవహరించడంలో వింతేమీ లేదు. ఎందుకంటే, కూటమి చేతిలో వైసీపీ రాజకీయంగా చావు దెబ్బ తినేసింది గనుక. కానీ, ఆ వైసీపీని మించి టీడీపీలో ఓ వర్గం, కూటమిని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తుండడం పట్ల జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తాను ఏం చేసినా ప్రజోపయోగం కోణంలోనే వుంటుందనీ, ప్రభుత్వ పెద్దగా చంద్రబాబు నుంచి తనకు పూర్తి మద్దతు వుందనీ పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. మిగతా మంత్రులు (టీడీపీ, బీజేపీకి చెందిన మంత్రులు) సహకరిస్తున్నా, ఓ వర్గం టీడీపీ అను‘కుల’ మీడియా సహా, సోషల్ మీడియా బ్యాచ్, తనను ట్రోల్ చేయడం ద్వారా కూటమిని దెబ్బ తీయాలని చూస్తుండడాన్ని పవన్ కళ్యాణ్ సైతం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ కావొచ్చు, జనసేన కావొచ్చు, బీజేపీ కావొచ్చు.. ఈ మూడు పార్టీలకు సంబంధించి కింది స్థాయి కార్యకర్తలైనా, కూటమికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్షమించకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతో భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ కుండబద్దలుగొట్టారట.