ఔను, మీడియాని రాజకీయం నిషేధించింది.! సో, ఇకపై రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో మీడియా పాల్గొనకూడదు.! అసలు మీడియా ఎక్కడుంది.? ఇప్పుడున్నదంతా పొలిటికల్ మాఫియానే కదా.! ఆయా రాజకీయ పార్టీల కనుసన్నల్లో మీడియా సంస్థలు నడుస్తున్నాయంటే, దానర్థం మీడియా చచ్చిపోయిందనే.!
మరి, మీడియా ప్రతినిథుల సంగతేంటి.? వాళ్ళు జస్ట్ సాధారణ ఉద్యోగులు మాత్రమే. పాత్రికేయం అనేది జస్ట్ ఓ వృత్తి.! అంతకు మించి, ఆ వృత్తికి నిబద్ధత.. నిమ్మకాయ.. వంటివేమీ వుండకూడదు.
ఇటీవల వైసీపీ ‘సిద్ధం’ బహిరంగ సభ జరిగింది.. అదీ రాయలసీమలో. పది లక్షల మంది జనం వచ్చారన్నది వైసీపీ వాదన. రాజకీయ పార్టీల బహిరంగ సభలకు జనం రావడం ఎప్పుడో మానేశారు. జనాన్ని కొనితెచ్చుకోవాల్సిందే ఎవరైనా.
ఇక్కడే, ఓ మీడియా ప్రతినిథి మీద దాడి జరిగింది. చితక్కొట్టేశారు పాపం ఆ జర్నలిస్టుని. అతనేం పాపం చేశాడని.? వైసీపీకి నచ్చని మీడియా సంస్థలో సదరు జర్నలిస్టు పనిచేస్తున్నాడు. చావు దెబ్బలు తిన్నాక.. పాపం ఎలాగో అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
కాస్తలో చంపేసేవారే.! వాళ్ళసలు వైసీపీ కార్యకర్తలేనా.? కాదు కాదు, కిరాయి మూకలు.! రౌడీలు, హంతకులు.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. జర్నలిస్టు కాబట్టి బతికిపోయాడు.. అదే, ఏబీఎన్ రాధాకృష్ణ అయితే, వేరేలా వుండేది. రామోజీరావు అయినా, ఇంకొకరైనా.. ఆ పరిస్థితిని ఊహించుకోలేం.. అని వైసీపీ నేత, మాజీ మంత్రి ఒకరు సెలవిచ్చారు.
మేం బ్యాన్ చేసిన మీడియా నుంచి, మా కార్యక్రమాలకు వస్తే ఊరుకుంటామా.? అయినా, పది లక్షల మంది జనంలో.. ఎవర్ని కంట్రోల్ చేయగలం.? అంటూ చెప్పుకొచ్చాడాయన వీధి రౌడీలు కూడా ఇలా మాట్లాడరేమో.! ప్రజాస్వామ్యమంటే ఏంటో తెలియని కిరాయి మూకలు చట్ట సభల్లోకి వెళితే, ఇదిగో ఇలాంటి మాటలే వస్తాయన్నది ప్రజాస్వామ్యవాదుల ఆవేదన.
వైసీపీ సభల్లో టీడీపీ అనుకూల మీడియా ప్రతినిథులపై దాడి జరిగింది. మరి, టీడీపీ బహిరంగ సభల్లో వైసీపీ మీడియాపై దాడి జరిగితే.? రాజకీయ నాయకులు పార్టీలు మార్చేయడం కొత్త విషయం కాదు. అలాగే, జర్నలిస్టులు కూడా మీడియా సంస్థలు మారుతుంటారు. మొత్తంగా, జర్నలిస్టులంతా ఒక్కటే కదా.! అందుకే, పొరపాటున కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకలాపాల వైపు కన్నెత్తి చూడొద్దు.!
అసలది రాజకీయం కాదు.. తీవ్రవాదం.. అనడం సబబేమో.!