సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై వాదోపవాదాలు జరిగాయి. రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల్ని సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
హైకోర్టు తీర్పుల్లోని ‘కాల పరిమితి’కి సంబంధించిన అంశాలపై ‘స్టే’ విధించింది సర్వోన్నత న్యాయస్థానం. నిజానికి, ఈ ‘స్టే’ అన్న మాట అస్సలు నచ్చదు అధికార వైసీపీకి. ‘స్టే’ తెచ్చుకోవడాన్ని అదేదో బూతులా చూస్తుంటుంది వైసీపీ అనుకూల మీడియా.. అదీ చంద్రబాబుని విమర్శించే క్రమంలో. కానీ, ఈసారి వైసీపీ ‘స్టే’ని స్వాగతించింది. ఎందుకంటే, అది తమకు అనుకూలమని వైసీపీ అనుకుంటోంది గనుక. వైసీపీ అనుకూల మీడియాలో ఈ మేరకు ‘విజయం సాధించాం’ అనే స్థాయిలో రచ్చ నడిచింది. విజయం సాధించడం కాదు, కొంత ఊరట లభించిందంతే.
ఇక, టీడీపీ అనుకూల మీడియా విషయానికొస్తే, ‘సుప్రీంకోర్టులో వైసీపీ సర్కారుకి షాక్. ఎదురు దెబ్బ..’ అంటూ, మొత్తంగా అన్ని అంశాలపై ‘స్టే’కు సుప్రీం నిరాకరించడంపై కథనాలు కనిపించాయి. డిబేట్లు కూడా ఆ కోణంలోనే నడిచాయి.
అటు వైసీపీకీ, వైసీపీ అనుకూల మీడియాకీ.. ఇటు టీడీపీకీ, టీడీపీ అనుకూల మీడియాకి.. రాష్ట్ర ప్రయోజనాలతో పనిలేదు. అసలు సర్వోన్నత న్యాయస్థానం నిజానికి ఏం చెప్పిందన్నదీ వీరికి అవసరం లేదు. తమక్కావాల్సిన ‘పాయింట్ల’ చుట్టూ ఎవరికి తోచినట్లు వారు విశ్లేషించేసుకున్నారు, కథనాల్ని వండి వడ్డించేసుకున్నారు.
పెద్ద కామెడీ ఏంటంటే, వికేంద్రీకరణ విషయమై సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు సానుకూల వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ అనుకూల మీడియాలో కథనాలు రావడం.
నిజానికి, విషయం మూడు రాజధానులకు సంబంధించినది కాదు. అసలు ఆ చట్టం అమలులో లేదనీ, బిల్లుని ప్రభుత్వం వెనక్కి తీసుకుందనీ స్వయంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులే సుప్రీంకోర్టులో స్పష్టం చేశాక.. పరిపాలనా వికేంద్రీకరణ అన్న ప్రస్తావన ఎలా వస్తుంది.?
నిజానికి, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సిగ్గుపడాల్సిన సందర్భమిది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి.. ఎనిమిదేళ్ళు పూర్తవుతున్నా రాష్ట్రానికి రాజధాని ఏది.? అంటే, సమాధానం చెప్పుకోలేని దుస్థితి. రాష్ట్ర ప్రయోజనాలతో అధికారంలో వున్నవారికీ, ప్రతిపక్షంలో వున్నవారికీ.. వీరి కోసం పనిచేస్తున్న మీడియాకీ.. ఎవరికీ అవసరం లేదన్నమాట.