సికింద్రాబాద్ లోని నల్లగుట్ట ప్రాంతంలోని డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ షోరూంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆరు అంతస్థుల భవనంలో కింద కార్ల విడి భాగాల గోడౌన్, పైన స్పోర్ట్స్ షోరూం ఉన్నాయి. మంటలు గోడౌన్ లో చెలరేగి పై అంతస్థుల వరకూ వెళ్లడంతో భారీ ప్రమాదం జరిగి పొగలు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొస్తున్నారు. ఉదయం 11గంటలకు ప్రమాదం జరిగినా 3గంటల వరకూ మంటలు అదుపులోకి రాలేదు. పై అంతస్థులో చిక్కుకున్న వారిని రక్షించారు. పొగలు పక్క భవనాలకు, చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. పొగల ధాటికి ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై ప్రభుత్వం స్పందించింది. నగరంలో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని.. అనుమతులు లేని పరిశ్రమలు, గోడౌన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు.