Manchu Family: వయసు మీద పడుతోంది సీనియర్ నటుడు, నిర్మాత మోహన్‌బాబుకి. ఈ వయసులో ఆయన మనసుకి కష్టం కలిగించేలా వ్యవహరించడం కన్న బిడ్డలకు తగునా.? ఇటీవలే మోహన్‌బాబు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కొన్ని రోజుల ముందర మోహన్‌బాబు రెండో కొడుకు మనోజ్‌కి రెండో వివాహం జరిగింది.
మనోజ్ వివాహ వేడుకలో మోహన్‌బాబు పెద్ద కొడుకు మనోజ్ ఒకింత అయిష్టంగానే కనిపించాడన్న ప్రచారం జరిగింది. అసలు ఆ పెళ్ళి మోహన్‌బాబుకీ ఇష్టం లేదన్న ఊహాగానాలు వినిపించాయి. వాటితోపాటుగా గత కొంతకాలంగా అన్నాదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోందాయె.
ఇంతలోనే, విష్ణు ఒకరి ఇంట్లోకి చొరబడి దాడికి యత్నించడానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అది కూడా స్వయానా మనోజ్ విడుదల చేశాడు. మనోజ్‌కి అత్యంత సన్నిహితుడైన సారధి అనే వ్యక్తి ఇంట్లో జరిగిందిది. విషయం మోహన్‌బాబు దృష్టికి వెళ్ళగానే, ఆయన మనోజ్‌తో మాట్లాడి సోషల్ మీడియా నుంచి దాన్ని తొలగించమని ఆదేశించారట. మనోజ్, తన తండ్రి మీదున్న గౌరవంతో ఆ వీడియోను తొలగించాడు.
కానీ, ఈలోగా ఆ వీడియో వైరల్ అయి కూర్చుంది. ప్రస్తుతం సారధి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడట. ‘జరిగింది చిన్న గొడవ మాత్రమే. పైగా, ఇది మా కుటుంబ సమస్య. చిన్నవాడు మనోజ్.. ఏదో తొందరపాటులో వీడియో విడుదల చేశాడు’ అంటూ విష్ణు, మీడియాకి సమాచారం ఇచ్చాడు.
అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న సమస్యలు మామూలేననీ, విషయాన్ని పెద్దది చేయొద్దంటూ మోహన్‌బాబు కూడా మీడియాని అభ్యర్థించారు. చిత్రంగా మీడియా మొత్తం ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకుంది. అదే ఇంకెవరి ఇంట్లో అయినా ఇలాంటివి జరిగితే, అందర్నీ రోడ్డు మీదకు లాగేసేదే తెలుగు మీడియా.
ఇదిలా వుంటే, మనోజ్ – విష్ణు మధ్య రాజీ కుదిర్చేందుకు మోహన్‌బాబు తన కుమార్తె లక్షీప్రసన్నతో కలిసి ప్రయత్నాలు ముమ్మరం చేశారట. కాస్సేపట్లో మంచు విష్ణు ఇంట్లో మొత్తం నలుగురూ కుర్చుని, సమస్యను పరిష్కరించుకుంటారట.