టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాయచోటి లో జరిగిన “జగన్నాథ్” అనే సినిమా ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన వేదికపై అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తనని తొక్కేయాలన్నా… పైకి తీసుకురావాలన్న అభిమానులకే సాధ్యమని ప్రపంచంలో ఇంకెవరి వల్ల కాదని అన్నారు.
” ఎదుటివారు కష్టంలో ఉన్నారంటే ఆదుకోవడానికి రాయలసీమ ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమాలో చాలామంది ఇక్కడ వారే కదా. అందుకే ఈ సినిమా ఈవెంట్ ను ఇక్కడ పెట్టుకోమన్నాను. ఇక నాపై బురద చల్లాలని చూసినా.. నన్ను నాలుగు గోడల మధ్యలోకి రానివ్వకపోయినా మీ గుండెల్లో నుంచి నన్ను తీయలేరని నమ్ముతున్నా. ఎందుకంటే మీరే నా కుటుంబం. మీరే నా దేవుళ్ళు. మీరే నాకు అన్నీ. చెట్టు పేరు జాతి జాతి పేరు చెప్పుకునే మార్కెట్లో అమ్ముడు పోవడానికి నేను కాయో పండో కాదు మనోజ్ ని. నన్ను తొక్కుదామని చూస్తారా? అది మీ జనాల వల్ల అభిమానుల వల్ల తప్ప ఎవరి వల్లా సాధ్యం కాదు. నా స్టూడెంట్స్ కోసం, నా ఊరు జనాల కోసం ఎంత దూరమైనా వెళ్తాను.. నా ప్రాణం ఉన్నంత వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉంటా. ఈ రోజే కాదు ఎప్పటికీ ఎవ్వరూ నన్ను ఆపలేరు” అని మనోజ్ వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా మంచు కుటుంబంలో ఆస్తి వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మనోజ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.