తిరుపతి జిల్లాలోని చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్ ముందు హీరో మంచు మనోజ్ నిరసన వ్యక్తం చేశారు. తను తన సిబ్బందితో కలిసి స్థానికంగా ఉన్న లేక్ వ్యాలీ రిసార్ట్స్ లో బస చేస్తుండగా.. పోలీసులు అక్కడికి వచ్చి తన సిబ్బందిని ప్రశ్నించారని మనోజ్ తెలిపారు. తాము మనోజ్ మనుషులమని చెప్తున్నప్పటికీ పోలీసులు లెక్క చేయలేదని అన్నారు. పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పినట్లు మనోజ్ పేర్కొన్నారు.
దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి భాకరాపేట పోలీస్ స్టేషన్ వెళ్ళగా.. అక్కడ అధికారులు లేకపోవడంతో స్టేషన్ ముందు బైఠాయించారు. తాను ఎక్కడికి వెళ్లినా.. ఏ హోటల్లో ఉన్నా వచ్చి ఇబ్బంది పెడుతున్నారని పోలీసులపై ఫైరయ్యారు. తాను బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదినో, క్రిమినల్ లో కాదని.. పుష్ప కోసం షెకావత్ వచ్చినట్లు తన కోసం పోలీసులు రావడం ఏంటని ప్రశ్నించారు.
అనంతరం స్టేషన్ సీఐ ఇమ్రాన్ బాషా తో ఫోన్ లో మాట్లాడారు. ఎంబీయూ విద్యార్థుల కోసం పోరాడుతున్న తనను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని సీఐ తో చెప్పగా.. ఆయన అక్కడకు వచ్చి మనోజ్ కు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.