Manchu Manoj: హీరో మంచు మనోజ్, సిబ్బందిని పోలీసులు ప్రశ్నించడం.. ఆయన పోలిస్ స్టేషన్ కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్ కు సోమవారం రాత్రి 11.15 గంటల సమయంలో వెళ్లిన ఆయన అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. తననెందుకు ఇబ్బంది పెడుతున్నారని పోలీసులను ప్రశ్నించారు.
మనోజ్, ఆయన సిబ్బంది కనుమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్లో బసచేయగా పోలీసులు స్టేషన్ కు పిలిచారని మనోజ్ ఆరోపించారు. తామె పెట్రోలింగ్ లో ఉండగా విషయం తెలుసుకుని.. ఈ సమయంలో ఇక్కడెందుకు ఉన్నారని మనోజ్ ను ప్రశ్నించారని తెలుస్తోంది. ఈక్రమంలో వారిద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది.
తాను ఎక్కడికెళ్లినా పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మనోజ్ ఆరోపించారు. అనంతరం సీఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్లో మాట్లాడారు. ఎంబీయూ విద్యార్థుల సమస్యలపై తాను పోరాడుతుంటే ఇలా ఇబ్బందులు పెట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటివల మంచు కుటుంబంలో వివాదలు నెలకొన్న నేపథ్యంలో ఈ సంఘటన చర్చనీయాంశమైంది.