మంచు కుటుంబంలో ఆస్తుల పంపకాల రగడ గురించి కొత్తగా చెప్పేదేముంది.? మోహన్‌బాబు, విష్ణు ఓ వైపు.. మనోజ్ ఇంకో వైపు.. వెరసి, ఆధిపత్య పోరు ఓ రేంజ్‌లో నడుస్తోంది.
తనపై మనోజ్ హత్యాయత్నం చేశాడని మోహన్‌బాబు, మోహన్‌బాబు, విష్ణు తనపై హత్యాయత్నం చేశారని.. పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. మనోజ్ మీద మోహన్‌బాబు, విష్ణు నేరుగా ఫిర్యాదు చేస్తే, మోహన్‌బాబు మీద ప్రేమ ఒలకబోస్తూనే, ఆయనకి వ్యతిరేకంగా మనోజ్ ఫిర్యాదు చేయడం చూశాం.
హైద్రాబాద్‌లో కొద్ది రోజుల క్రితం పెద్ద రచ్చే జరిగింది. ఈ క్రమంలో ఓ జర్నలిస్ట్‌కి తీవ్ర గాయాలయ్యాయి.. హత్యాయత్నం కేసు ఈ ఘటన నేపథ్యంలో మోహన్‌బాబు మీద నమోదయ్యింది కూడా. పోలీస్ ఉన్నతాధికారులు, మోహన్‌బాబు సహా, విష్ణు, మనోజ్‌లకు ఆల్రెడీ క్లాసులు తీసుకున్నారు, వారి నుంచి రాతపూర్వక అఫిడవిట్లు తీసుకున్నారు.. పూచీకత్తుతో సహా.
దాంతో, విషయం తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కి షిఫ్ట్ చేసినట్లుంది మంచు కుటుంబం. మంచు కుటుంబానికి చెందిన మోహన్‌బాబు యూనివర్సిటీకి మనోజ్ వెళ్ళాడు.. సతీ సమేతంగా. అందులోకి మనోజ్‌ని రానివ్వకుండా విష్ణు తగిన ఏర్పాట్లు చేయడంతో, పోలీసుల్ని ఆశ్రయించాడు మనోజ్.
తన మీదా, తన భార్య మీదా విష్ణు అనుచరులు దాడి చేశారంటూ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేయడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఈ రచ్చ ఎక్కడిదాకా వెళుతుందోగానీ.. మీడియాకి ఇదంతా ఓ పెద్ద నస వ్యవహారంలా మారిపోయింది. అదే సమయంలో, ఓ వర్గం మీడియాకి ఇదో పెద్ద ‘విందు భోజనం’ అయి కూర్చుంది.
