తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిత్యం ఉప్పు, నిప్పులా ఉండే సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. ఈ విషయమే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బుధవారం సీఎం రేవంత్ ను ఆయన నివాసంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసారు. తన మనవరాలి పెళ్లికి కుటుంబ సమేతంగా రావాలంటూ సీఎం రేవంత్ ను ఆహ్వానించారు మల్లారెడ్డి. రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కూడా ఆహ్వానించారు మాజీ మంత్రి.
నిన్న ఏపీ సీఎం చంద్రబాబును కూడా ఆయన కలిసి పెళ్లికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహానికి రెండు రాష్ట్రాల్లోని కీలక నేతలను ఆహ్వానిస్తున్నారు మల్లారెడ్డి. అయితే రాజకీయ పరంగా మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి నిత్యం గొడవ పడిన సంగతి తెలిసిందే. రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లారెడ్డిపై ఎన్ని రకాల ఆరోపణలు చేశారో చూశాం. అటు మల్లారెడ్డి కూడా నిత్యం రేవంత్ ను టార్గెట్ చేస్తూనే ఉంటారు. అలాంటి వీరిద్దరూ ఇలా భేటీ అవుతారని బహుషా ఎవరూ ఊహించలేదు.
అయితే కొన్ని రోజులుగా మల్లారెడ్డి పార్టీ మారుతారని.. ఒకసారేమో టీడీపీలోకి వెళ్తారని.. మరోసారి కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన మాత్రం ఈ రూమర్లపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి రేవంత్ పెళ్లికి వెళ్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.