151 మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. కేవలం 10 ఎమ్మెల్యేలకు పరిమితమైపోయిందంటే, దీన్ని ఏమనాలి.? ‘కూల్చివేత’ అనొచ్చా.? అంతేనేమో.!
2019 ఎన్నికల్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 2024 ఎన్నికలకొచ్చేసరికి కుప్పకూలిపోయింది. అసలెందుకింత దారుణ పరాజయం. నవరత్నాలన్నారు.. 99 శాతం ఎన్నికల హామీలు పూర్తి చేశామన్నారు.. ఇంకోసారి అధికారంలోకి వచ్చేందుకు ‘సిద్ధం’ అని కూడా చెప్పారు.
ఎక్కడ తేడా కొట్టింది.? పెద్దిరెడ్డి రామచంద్రరా రెడ్డి తప్ప మంత్రులంతా ఎందుకు ఓడిపోయినట్లు.? 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ తరఫున గెలిస్తే, ఆ సంఖ్య మధ్యలోని ‘5’ మిస్ అయి, కేవలం 11 మాత్రమే వైసీపీ ఎందుకు 2024 ఎన్నికల్లో గెల్చుకుంది.?
వైసీపీ పతనానికి చాలా కారణాలున్నాయ్. ‘మోసం చేశారు’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన అక్కసుని రాష్ట్ర ప్రజల మీద వెల్లగక్కేశారు. కానీ, తల్లి అలాగే చెల్లి కూడా నమ్మని వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, రాష్ట్ర ప్రజలు మాత్రం ఎలా నమ్ముతారు.?
జగన్ ఏ సభలు నిర్వహించినా, వాటికి జనాన్ని బలవంతంగా రప్పించుకున్నారు. అప్పుడే ఆయనకు అర్థమయి వుండాల్సింది. తన ప్రసంగాల్ని వినకుండా జనం పారిపోతున్నప్పుడైనా ఆయన అప్రమత్తమై వుండాల్సింది.
ఎక్కడా.. ఏ సందర్భంలోనూ వైఎస్ జగన్ ఆత్మ విమర్శ చేసుకోలేకపోయారు. ప్రజా వేదికతో మొదలెట్టిన వైఎస్ జగన్ ‘కూల్చివేత’, ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ‘వైసీపీ’ కూల్చివేతతో పూర్తయ్యింది.