‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన అభిమానుల్ని ఉద్దేశించి వారిస్తూ వచ్చేవారు. ఒక్కోసారి కోపంగా కూడా చెప్పారు.
‘మీరు తిట్టండి.. కానీ, మేం ఓజీ అని అరుస్తూనే వుంటాం. అది మీ మీద మా అభిమానం..’ అని సోషల్ మీడియాలో ట్వీట్లు వేసి మరీ, జనసైనికులు పిఠాపురం – చిత్రాడలో జనసేన నిర్వహించిన ‘జయకేతనం’ బహిరంగ సభకు వెల్ళారు.. అధినేత పవన్ కళ్యాణ్ ముందరే ‘ఓజీ ఓజీ’ అంటూ నినాదాలు చేశారు.
అయితే, ఈసారి పవన్ కళ్యాణ్, తన అభిమానుల్ని కాస్త డిఫరెంట్‌గా డీల్ చేశారు. ‘మీరు ఇక్కడ ఇలాంటి నినాదాలు ఎందుకు చేయకూడదో తెలుసా.? జనసేన సిద్ధాంతాల కోసం దాదాపు 450 మంది జనసైనికులు ప్రాణ త్యాగాలు చేశారు. వారికి మనం ఇలాంటి వేదికల్లో గౌరవం ఇవ్వాలి..’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
దాంతో, ఒక్కసారిగా వేదిక అంతా ‘పిన్ డ్రాప్ సైలెంట్’ అయిపోయింది. ఇక, అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి మాటనీ, జనసైనికులు చాలా చాలా శ్రద్ధగా వింటూ వచ్చారు. ‘సీఎం పవన్ కళ్యాణ్’ అనే నినాదాలు అక్కడక్కడా వినిపించినా.. వాటి శబ్దం కూడా చాలా తక్కువే వుంది.
సాధారణంగా పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో ఒకింత ‘ఆవేశం’ ఎక్కువగా వుంటుంది. ఆవేదనలోంచి పుట్టే ఆవేశం అది. వేదిక మీదకు వస్తూనే, హై ఓల్టేజ్ పవర్‌తో పవన్ కళ్యాణ్ కనిపించారు. ఆ తర్వాత ప్రసంగం ప్రారంభించాక కూడా కొన్ని సెకెన్ల పాటు ఆ హై ఓల్టేజ్ ఎనర్జీని, తన ప్రసంగంలో చూపించారు. అంతే, ఆ తర్వాత ప్రసంగం పూర్తిగా కొత్త టర్న్ తీసుకుంది.
బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రస్తావన, గోద్రా అల్లర్ల వ్యవహారం, సనాతన ధర్మం, హిందువుల – క్రిస్టియన్ల గురించిన ప్రస్తావన.. ఇలా కీలక అంశాల గురించి జనసేనాని మాట్లాడుతోంటే, జనసైనికులు చెవులు రిక్కించి విన్నారు. ఎక్కడా ఎలాంటి ‘నాయిస్’ లేకుండా పోయింది.
అలాగని, మొత్తం ప్రసంగం సీరియస్ టోన్‌లోనే సాగిందనుకుంటే అది పొరపాటే. సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా పవన్ కళ్యాణ్ తన మీద తాను కూడా ఒకట్రెండు సెటైర్లు వేసుకున్నారు. అప్పుడు, సభా ప్రాంగణమంతా నవ్వులతో నిండిపోయింది. ఆ తర్వాత మల్ళీ వెంటనే, సీరియస్ టోన్.
పారిశుధ్య కార్మికులకు థ్యాంక్స్ చెప్పడం దగ్గర్నుంచి, వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థ పని చేసిన తీరు దగ్గర వరకు, అలాగే నా కానిస్టేబుల్ సోదరులకు.. అని పవన్ కళ్యాణ్ పేర్కొన్న తీరు.. వాట్ నాట్.. అన్నీ చాలా చాలా ప్రత్యేకమే.
ప్రతి మాటా క్షుణ్ణంగా వినండి, అర్థం చేసుకోండి.. అంటూ, శ్రీశ్రీ సహా గుంటూరు శేషేంద్ర శర్మ తదితర కవుల ప్రస్తావన, వారు చెప్పిన మంచి మాటల్ని చెబుతూ ప్రసంగాన్ని పరుగులు పెట్టించారు జనసేనాని పవన్ కళ్యాణ్.
ఇప్పటిదాకా ఎన్నో బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఉర్రూతలూగించి వుండొచ్చు. ఈసారి మాత్రం, ఉర్రూతలూగిస్తూనే మరింతగా ఆలోచింపజేసేలా ప్రసంగించారు.
ఆయన ఆలోచింపజేసే ప్రసంగం చేయడం ఓ యెత్తు అయితే, దాన్ని ఆసాంతం, ఆసక్తిగా విని, జనసైనికులు అర్థం చేసుకోవడం, అధినేత ఆలోచనలకు తగ్గట్టుగా తమ ఆలోచనల్ని జనసైనికులు మార్చుకోవడం ఇంకో యెత్తు. ఇది జయకేతనం సాక్షిగా కనిపించిన అతి పెద్ద మార్పు.