సూపర్ స్టార్ మహేష్‌బాబు, తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర హీరోల్లో ఒకరు. గత సినిమాల ఫలితాలెలా వున్నా, తన కొత్త సినిమాకి ప్రీ రిలీజ్ హైప్‌ని ఆకాశమెత్తుకి తీసుకెళ్ళగల కెపాసిటీ వున్న సూపర్ స్టార్ మహేష్‌బాబు. అంతా ఊహించినదానికంటే ఎక్కువే బజ్ వుంది సినిమా విడుదలకు ముందు ‘మహర్షి’పైన. కానీ, మహేష్ గత సినిమాల విషయంలో ఎప్పుడూ జరగనంత ‘నెగెటివ్’ ప్రచారం ‘మహర్షి’కి జరుగుతుండడం అతని అభిమానుల్ని కొంత ఆందోళనకు గురిచేస్తోంది. దర్శకుడి విషయంలో, నిర్మాతల మధ్య పొరపచ్చాల విషయంలో.. ఇలా చాలా గాసిప్స్ వచ్చాయి, వస్తూనే వున్నాయి కూడా.
అవన్నీ పక్కన పెడితే, సరిగ్గా సినిమా విడుదలకు ముందు ‘టిక్కెట్ల ధరల పెంపు’ అంశం ఇప్పుడు మహేష్ పేరుని బజారుకీడ్చుతోంది. టిక్కెట్ల ధరలు పెద్ద సినిమాలకు తొలి వారం, రెండో వారం పెరగడం కొత్తేమీ కాదు. అదనపు షోలు కూడా మనకి తెలిసిన సంగతే. కానీ, ‘మహర్షి’ విషయంలో మాత్రం తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. టిక్కెట్ ధరల్ని పెంచినట్లు ఇప్పటికే స్పష్టమవుతోంది. పెంచిన దరలతో ఆల్రెడీ టిక్కెట్ల అమ్మకాలు కూడా జరిగిపోయాయి. మళ్ళీ కొత్తగా పెంచిన ధరలతోనూ టిక్కెట్లు అమ్మేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో. హైకోర్టు ఆదేశాలున్నాయంటూ టిక్కెట్ల పెంపుకి సంబంధించి ‘మహర్షి’ టీమ్ నుంచి ఓ వాదన తెరపైకొచ్చింది. కానీ, తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టిక్కెట్ల పెంపుపై ప్రభుత్వ ఆదేశాలు ఏమీ లేవని తేల్చేశారు. దాంతో, తీవ్ర అయోమయం ‘సినీ గోయర్స్’లో వ్యక్తమవుతోంది టిక్కెట్ల ధరలకు సంబంధించి.
అయితే, తెలంగాణలో అదనంగా మరో ‘షో’ ప్రదర్శన కోసం అధికారికంగా అనుమతిని పొందింది ‘మహర్షి’ టీమ్. ప్రస్తుతం మామూలుగా ప్రదర్శితమయ్యే నాలుగు షోలతోపాటు, ఇంకో షో అదనంగా పొందేందుకు ‘మహర్షి’ అర్హత సాధించిందన్నమాట. దాంతో, తొలి వారం వసూళ్ళను భారీగా కొల్లగొట్టవచ్చుననే గట్టి నమ్మకం నిర్మాతల్లో కన్పిస్తోంది. రికార్డు వసూళ్ళ గురించి ఆలోచించే అభిమానులు ఈ అదనపు షోలతో జరిగే మేలు కంటే కీడు ఎక్కువగా వుంటుందని శంకించడం మామూలే. ఎందుకంటే, గతంలో ఇలా అదనపు ప్రదర్శనలతో నష్టపోయిన సినిమాలూ కొన్ని లేకపోలేదు. ‘అజ్ఞాతవాసి’ ఆ కోవలోకే వస్తుంది. సినిమా ఫలితం బావుంటే మాత్రం, అదనపు షోలతో ఒనగూడే అదనపు ప్రయోజనం చాలా గట్టిగానే వుంటుంది.
ప్రయోజనాలు, నష్టాల సంగతి పక్కన పెడితే, ఏఎంబీ థియేటర్స్ ఓనర్‌గా కూడా వ్యవహరిస్తున్న మహేష్‌బాబు, టిక్కెట్ల ధర పెంపు విషయమై తన అభిమానులకు, సాధారణ సినీ ప్రేక్షకుల గురించి కాస్త ఆలోచించి వుంటే బావుండేది. భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించారు గనుక, టిక్కెట్ల ధరల్ని పెంచడం తప్పకపోవచ్చు. అయితే, అదే సమయంలో చట్టబద్ధంగా వ్యవహరించి ప్రభుత్వం నుంచి అనుమతి పొంది టిక్కెట్ల ధరల్ని గనుక పెంచితే ఆ లెక్క వేరేలా వుంటుంది. ఎంత మేర ధర పెంపుకు అనుమతులున్నాయో ప్రేక్షకులకు తెలియని పరిస్థితి.
సగటున 30 రూపాయల నుంచి 100 రూపాయల వరకు టిక్కెట్ల ధరలు అదనంగా పెరిగాయన్న ప్రచారం అయితే జరుగుతోంది ‘మహర్షి’ విషయంలో. ఇంకోపక్క, మరీ బ్లాక్ టిక్కెట్లు అమ్మినట్లుగా థియేటర్ల యాజమాన్యాలే ‘మహర్షి’ టిక్కెట్లను అమ్మేస్తున్నాయనీ, ఇదంతా ఓ పెద్ద మాఫియా అనీ విమర్శలొస్తున్నాయి. మహేష్ లాంటి హీరో సినిమాకి ఇలాంటి ఆరోపణలు రావడం, ఆ హీరో స్టార్‌డమ్‌కే మాయని మచ్చ అని కొందరు అంటోంటే, ఇందులో మహేష్ చేయగలిగిందేముంటుందని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.