మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మహానాడు వేడుకలతో కళకళలాడింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కార్యాలయానికి చేరుకుని మహానాడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నారా లోకేష్ నివాళులు అర్పించారు. పార్టీ స్థాపకుడైన ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించే దిశగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ ఏడాది మహానాడును ‘స్త్రీశక్తి’ థీమ్‌తో నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళా సాధికారత, మహిళల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తూ పార్టీ కార్యక్రమాలను రూపకల్పన చేసినట్లు నాయకులు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన క్లస్టర్లు, పార్టీ కార్యాలయాల నుంచి టీడీపీ శ్రేణులు ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మహానాడు సందర్భంగా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది.
