మహాకుంభమేళా సందర్భంగా ఎన్నో ఘటనలు తెరమీదకు వస్తున్నాయి. అందులోనూ నాగసాధువులు, అఘోరాలు, బాబాలు కుంభమేళా వద్ద కనిపిస్తున్న విధానాలు, అక్కడ వారు చేస్తున్న పనులు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా బాబాలు, నాగసాధువుల గురించే పెద్ద చర్చ జరుగుతోంది. వాళ్లు అసలు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏం తింటారు.. ఎలా జీవిస్తారు.. వాళ్ల పని ఏంటి అనే దాని గురించే చాలా రకాల కథనాలు వస్తున్నాయి. దాంతో వాళ్ల గురించి ప్రజల్లో కూడా చాలా ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే చాలా మంది తమ వ్యక్తిగత జీవితాలను వదిలేసి నాగసాధువులుగా మారుతున్నారు.
తాజాగా అఖాడాలో 1500 మంది నాగసాధువులుగా మారిపోయారు. తమతో పాటు తమ ఏడు తరాల కుటుంబీకులకు కూడా పిండం పెట్టేసి వారంతా నాగసాధువులుగా మారారు. నాగసాధువులుగా మారడం అంటే మామూలు విషయం కాదు. చాలా కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐదుగురు గురువులు వీరికి దీక్షను ప్రసాదిస్తారు. వారినే పంచ్ దేవ్ అంటారు. నాగసాధువులుగా జీవించడం అత్యంత కఠినం. కాషాయబట్టలు మాత్రమే వేసుకోవాలి. భిక్షాటన చేస్తూ బతకాలి. భిక్షాటనలో వచ్చిన ఆహారాన్ని మాత్రమే తినాలి తప్ప వేరే ఆహారాన్ని ముట్టుకోవద్దు. ఒకవేళ భిక్షాటనలో ఆహారం దొరక్కపోతే ఆ రోజు కడుపు ఖాళీగానే ఉండాలి.
ఇప్పుడు మహా కుంభమేళా సందర్భంగా ఎంతో మంది నాగసాధువులు, బాబాల గురించి కొన్ని టీవీల్లో కథనాలు వస్తున్నాయి. వాళ్ల బ్యాక్ గ్రౌండ్, చదువు, ఆస్తులు తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు.