Movie Reviews: ప్రస్తుతం ఎక్కడైనా సినిమా విడుదలైతే ధియేటర్ల వద్దే ప్రేక్షకులతో యూట్యూబర్స్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు.. సినిమా రివ్యూలు తీసుకుంటున్నారు. దీంతో ఆడియన్స్ నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అసలే ఓటీటీతో కుదేలవుతున్న సినీ పరిశ్రమలకు ఈ రివ్యూలు శరాఘాతంగా తగులుతున్నాయి.
ఈక్రమంలో తమిళ సినిమా నిర్మాతల సంఘం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇటివల విడుదలైన కంగువా, వెట్టయాన్, భారతీయుడు-2.. తదితర సినిమాలన్నింటికీ ఆన్ స్పాట్ రివ్యూలతో నష్టాలు వచ్చాయని.. మొదటి మూడు రోజులపాటు సినిమా రివ్యూలపై నిషేధం విధించాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు ఇవ్వాలని విన్నవించారు. దీనిపై హైకోర్టు స్పందించింది.
పిటిషన్ పరిశీలించిన న్యాయమూర్తి ఎస్.సౌందర్ సినిమా రివ్యూలపై నిషేధం విధించలేమని తెలిపారు. ప్రేక్షకుల రివ్యూ వారి భావప్రకటన స్వేచ్చగా పేర్కొన్నారు. దీనిపై ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని అన్నారు. దాఖలైన పిటిషన్ పై జవాబివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు యూట్యూబ్ కు ఉత్తర్వులు జారీ చేసి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేశారు.