జయ కిషోర్ దర్శకత్వంలో వచ్చిన మధుర వైన్స్ ప్రమోషనల్ మెటీరియల్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. సన్నీ, నవీన్, సీమ చౌదరి లీడ్ రోల్స్ లో నటించారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ:
తన జీవితం నుండి అర్ధాంతరంగా వెళ్ళిపోయిన తన గర్ల్ ఫ్రెండ్ ను మర్చిపోవడానికి అజయ్ (సన్నీ) మందుకు అలవాటు పడతాడు. రోజులో ఎక్కువ సమయం ఆనంద్ రావు (సమ్మోహిత్ తుమ్ములూరి) ఓనర్ గా ఉన్న మధుర వైన్స్ వద్ద గడుపుతుంటాడు. అయితే ఒకరోజు అజయ్, అంజలి (సీమ చౌదరి)ను చూసి ఇష్టపడతాడు.
అయితే అంజలి కుటుంబం రూపంలో అజయ్ కు భారీ ట్విస్ట్ వస్తుంది. ఏంటది? వైన్ షాప్ తో కనెక్ట్ అయిన ఆ ఇష్యూను అజయ్ ఎలా ఎదుర్కొన్నాడు? ఇదంతా సినిమా స్టోరీలో ప్రధాన భాగం.
నటీనటులు:
లవ్ ఫెయిల్యూర్ గా పెయిన్ అనుభవించే పాత్రలో సన్నీ నవీన్ నటించాడు. క్యారెక్టర్ లో భిన్న వేరియేషన్స్ ను చాలా బాగా చూపించాడు. తన పాత్రలో భిన్న ఎమోషన్స్ ను ప్లే చేసే స్కోప్ కూడా దొరికింది. హీరోయిన్ సీమ చౌదరి చాలా బాగుంది. చూడటానికి క్యూట్ గా ఉంది. హీరోతో ఆమె కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది. సమ్మోహిత్ తుమ్ములూరి ప్రధాన పాత్రలో బాగా నటించాడు. ఎమోషనల్ సీన్స్ లో తన నటన ఇంకా బాగుంది.
లీలా వెంకటేష్, హరీష్ రోషన్, రామచంద్ర, హీరో స్నేహితులుగా మంచి పాత్రల్లో కనిపించారు.
సాంకేతిక వర్గం:
జయ్ క్రిష్, కార్తీక్ రోడ్రిగెజ్ సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. మోహన్ చారి సినిమాటోగ్రఫీ న్యాచురల్ గా ఉంది. ముఖ్యంగా పాటల్లో తన పనితనం బాగా వర్కౌట్ అయింది. వర ప్రసాద్ ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండొచ్చు అనిపిస్తుంది. లో బడ్జెట్ లో తెరకెక్కినా కానీ నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి.
ముఖ్యంగా దర్శకుడు జయ కిషోర్ మధుర వైన్స్ అనే ఆసక్తికర టైటిల్ తో మన ముందుకు వచ్చాడు. ఆ టైటిల్ కే జనాలు సగం ఇంప్రెస్ అవుతారు. అలాగే దర్శకుడు సినిమాను ఓపెన్ చేసిన విధానం కూడా బాగుంటుంది. యువత ఎలా చెడు అలవాట్లకు బానిసై తమ విలువైన జీవితాన్ని, సమయాన్ని వృథా చేసుకుంటున్నారో చూపిస్తాడు.
జయ కిషోర్ దర్శకత్వం ఫస్ట్ హాఫ్ లో చాలా నార్మల్ గా గడిచినా ఇంటర్వెల్ బ్లాక్ తో ఆసక్తిని రేకెత్తించగలిగాడు. అయితే సెకండ్ హాఫ్ లో దర్శకుడు సన్నివేశాలను ఒక ఆర్డర్ లో పెట్టడంలో విఫలమయ్యాడు. అలాగే నరేషన్ కూడా స్లో అయింది.
పాజిటివ్ పాయింట్స్:
- లీడ్ పెయిర్ కెమిస్ట్రీ
- క్లైమాక్స్ లో ఇచ్చిన మెసేజ్
నెగటివ్ పాయింట్స్:
- ఆసక్తికరంగా సాగని స్క్రీన్ ప్లే
- సెకండ్ హాఫ్
విశ్లేషణ:
యువత జీవితంలో వచ్చే అడ్డంకుల నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామా మధుర వైన్స్. ప్రధాన నటీనటుల పెర్ఫార్మన్స్ బాగున్నా కానీ సెకండ్ హాఫ్ మెయిన్ మైనస్ గా మారింది. దానివల్ల సినిమాపై ఇంప్రెషన్ దారుణంగా పడిపోతుంది అనడంలో సందేహం లేదు.