సోషల్ మీడియా వేదికగా సినీ ఆర్టిస్టులపై వస్తున్న ట్రోల్స్, అసభ్యకర ప్రచారంపై చర్యలు తీసుకోవాలంటూ మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ( MAA ) సభ్యులు తెలంగాణ డీజీపీ జితేందర్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఇప్పటికే ఐదు యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోగా.. మరో 250 యూట్యూబ్ ఛానళ్ల వివరాలను “మా” సభ్యులు డీజీపీకి అందజేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి ఫిర్యాదు పై సానుకూలంగా స్పందించిన ఆయన.. సైబర్ సెక్యూరిటీ వారి సహకారంతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ట్రోల్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని డీజీపీ తెలిపారు.
ఈ సందర్భంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ” సినీ నటులపై మీమ్స్, ట్రోల్స్ శృతిమించి పోతున్నాయి. నవ్వుకునేలా ఏదైనా చేయడానికి అందరికీ స్వతంత్రం ఉంటుంది. కానీ అది మరొకరి మనోభావాలు దెబ్బతీసేలా ఉండకూడదు. ఈ మధ్యకాలంలో మన సంస్కృతి దిగజారి పోయేలా చాలామంది ప్రవర్తిస్తున్నారు. ఇది సినీ ఆర్టిస్టులకే కాదు సాధారణ జనాలకు కూడా మంచిది కాదు. ఏదైనా ఒక స్థాయి వరకే తట్టుకోగలం. కుటుంబ సభ్యులను కూడా లాగి విమర్శించడం సరికాదు. ఇకమీదట అలాంటివి సహించేది లేదు” అని అన్నారు.
“మా” కోశాధికారి శివబాలాజీ మాట్లాడుతూ ..” సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల సినీ ఆర్టిస్టులే కాదు కొందరు జర్నలిస్టులు మరికొందరు ప్రముఖులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మంచిలో కూడా చెడును వెతుకుతూ వెకిలి పోస్టులతో ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మేం కూడా సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ విభాగంతో కలిసి పనిచేసి ఇప్పటికే 25 చానళ్లపై చర్యలు తీసుకున్నాం. ఈనెలాఖరిలోపు ఇంకా మిగిలిన యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేస్తాం” అని అన్నారు.