పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే అప్రోచ్ చానెల్ తవ్వకాల్లో పురాతన శివలింగం బయటపడిన విషయం తెలిసిందే. అయితే.. ఈ శివలింగం 12వ శతాబ్దానికి చెందినదని కాకినాడ పురావస్తు శాఖ డైరక్టర్ తిమ్మరాజు తెలిపారు. చాళక్యుల కాలంలో గోదావరి తీరంలో శివలింగాలు ప్రతిష్టించి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శివలింగం బయటపడిన ప్రాంతంలోనే మరింత లోతుగా తవ్వకాలు జరిపితే మరిన్ని పురాతన ఆధారాలు లభ్యం కాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. తవ్వకాల్లో బయటపడ్డ శివలింగం.. పట్టిసీమ ఆలయంలోని శివలింగం ఆకృతినే పోలి ఉందని అన్నారు.
1996 నుంచి 2002 వరకూ పోలవరం ముంపు ప్రాంతాల్లోని 375 గ్రామాల్లో పురావస్తు శాఖ జరిపిన విస్తృత తవ్వకాల్లో బయల్పడిని విగ్రహాలు, అవశేషాలతో 5 ఎకరాల్లో మ్యూజియం ఏర్పాటు చేసి అన్నింటిని భద్రపరుస్తామని అన్నారు. ఇందుకు 40-50కోట్లు ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉందని అన్నారు. పోలవరం మండలం పాత పైడిపాక గ్రామంలో జరిపిన తవ్వకాల్లో రెండో శతాబ్దం నాటి ఇటుకలు, దేవాలయాల ఆనవాళ్లు గుర్తించామని అన్నారు.