అమరావతి: శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఇది వ్యక్తిగత దాడిగా అభివర్ణిస్తూ, ఆ వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలని ఛైర్మన్‌ను కోరారు. శాంతిభద్రతలపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గత పాలనలో చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభకు తగిన భద్రతలు కల్పించలేదని సోము వీర్రాజు ప్రస్తావించగా, దీనిపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాకౌట్ ప్రకటించారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, సభ్యులను మెప్పించడానికి తాము సభకు రాలేదని స్పష్టం చేశారు. ప్రధాని సభ జరిగిన రోజున తామంతా అక్కడే ఉన్నామని, సరైన భద్రత లేకపోవడంతో బ్యారికేడ్లు విరిగిపోవడం, మైక్ కట్ కావడం వంటి అవాంఛనీయ ఘటనలు జరిగాయని చెప్పారు. ఆ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసి అధికారులను సస్పెండ్ చేసిన విషయం కూడా ఉందని గుర్తుచేశారు. అయినా కూడా వాస్తవాలను చెప్పడాన్ని రాజకీయంగా మలచడం సరికాదన్నారు.
శాంతిభద్రతలపై చర్చ జరుగుతున్నప్పుడు వాకౌట్ చేయడం బొత్సకు అలవాటుగా మారిందని లోకేష్ విమర్శించారు. చర్చకు వచ్చి వాస్తవాలను వినాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందని, కానీ సమయం చూసుకుని బయటకు వెళ్లిపోవడం సరైన ధోరణి కాదన్నారు. వాకౌట్‌లతో సమస్యలు పరిష్కారం కావని, సభలోనే నిలబడి వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
సోము వీర్రాజుపై చేసిన వ్యాఖ్యలు సభా గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, వ్యక్తిగత విమర్శలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని లోకేష్ అన్నారు. శాంతిభద్రతల అంశంపై వాస్తవాలను ప్రజల ముందుంచడమే తమ బాధ్యత అని, దానిని అడ్డుకునే ప్రయత్నాలు సరికాదన్నారు. సభలో వాస్తవాలు చెప్పే హక్కు ప్రభుత్వానికి ఉన్నట్టే, వినాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి కూడా ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా చర్చ జరగాలని, వ్యక్తిగత దూషణలకు సభ వేదిక కాకూడదని లోకేష్ వ్యాఖ్యానించారు.
