ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామిక పార్క్‌లో క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం డేటా సెంటర్ల నిర్మాణం మాత్రమే కాదు, వాటికి అవసరమైన పరికరాల తయారీలో కూడా భారత్ ప్రపంచ నాయకత్వాన్ని సాధించాలని లోకేష్ స్పష్టం చేశారు.
ప్రపంచ ప్రఖ్యాత కూలింగ్ దిగ్గజం క్యారియర్ సంస్థ ఏపీలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3,000 ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. క్యారియర్ వంటి గ్లోబల్ సంస్థ ఏపీని ఎంచుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వాతావరణంపై అంతర్జాతీయ సంస్థలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని లోకేష్ పేర్కొన్నారు.
శ్రీసిటీని ఆయన గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివర్ణించారు. 8,500 ఎకరాల్లో విస్తరించిన ఈ పారిశ్రామిక నగరంలో ఇప్పటికే 31 దేశాలకు చెందిన 250కిపైగా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఇక్కడి నుంచి 6 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయని వెల్లడించారు. 70 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించగా, వారిలో సగం మహిళలే కావడం ప్రత్యేకతగా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే “ఇండియాస్ కూల్ క్యాపిటల్”గా గుర్తింపు పొందిందని లోకేష్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 ప్రముఖ ఏసీ తయారీ సంస్థలు, 30కిపైగా కాంపోనెంట్ భాగస్వాములు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. రూ.12 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో హెచ్‌వీఏసీ రంగం వేగంగా విస్తరిస్తోందని, 2027 నాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే ఏసీల్లో 60 శాతం ఏపీ నుంచే వస్తాయని అంచనా వేశారు. 2028 నాటికి అది 80 శాతానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
డేటా సెంటర్ల నిర్మాణంలో ప్రపంచవ్యాప్తంగా భారీ పోటీ నెలకొన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని లోకేష్ పేర్కొన్నారు. విశాఖలో ఏఐ డేటా సెంటర్ల నుంచి రాష్ట్రవ్యాప్తంగా తయారీ కేంద్రాల వరకు పూర్తి స్థాయి ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే తమ లక్ష్యమని చెప్పారు. డేటా సెంటర్లకు అవసరమైన అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, చిల్లర్స్ వంటి పరికరాల తయారీలో భారత్ అగ్రగామిగా మారే అవకాశం ఉందన్నారు. ఫార్మా రంగంలో భారత్ ఎలా ప్రపంచ నాయకత్వం సాధించిందో, అదే విధంగా డేటా సెంటర్ పరికరాల తయారీలో కూడా దేశం ముందంజలో నిలవగలదని అభిప్రాయపడ్డారు.
2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే చంద్రబాబు నాయుడు లక్ష్యమని లోకేష్ వెల్లడించారు. పెట్టుబడుల ద్వారా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. యువతకు పరిశ్రమలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడానికి స్కిల్ పోర్టల్‌ను తీసుకొస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”కు ప్రాధాన్యం ఇస్తున్నామని, పరిశ్రమలకు అవసరమైన అనుమతులు వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
క్యారియర్ సంస్థ ఏపీని ఎంచుకోవడం కేవలం ఒక పరిశ్రమ ప్రారంభం మాత్రమే కాదని, భవిష్యత్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రాలు, డేటా సెంటర్ పరికరాల తయారీ యూనిట్లు కూడా రాష్ట్రానికి రావడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ సీఈవో డేవిడ్ ఎల్ గిట్లిన్, క్యారియర్ ఇండియా ప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు, శ్రీసిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
