సింగపూర్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సింగపూర్ కమాడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ (CIC) సీఈవో గ్లోరియా ఊతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచ మార్కెట్లకు ఎగుమతులను మరింత విస్తరించే దిశగా పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
సింగపూర్–విశాఖపట్నం లేదా కృష్ణపట్నం పోర్టుల మధ్య డిజిటల్ వాణిజ్య కారిడార్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించాలని మంత్రి లోకేష్ కోరారు. సీఐసీ బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి కాగితరహిత వాణిజ్య ప్రక్రియ, సరుకుల పారదర్శకత, వేగవంతమైన కస్టమ్స్ క్లియరెన్స్ వంటి అంశాల్లో సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయ్యే మిర్చి, సముద్ర ఉత్పత్తులు, ఖనిజాలు, ఔషధ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని లోకేష్ తెలిపారు. ముఖ్యంగా గుంటూరు మిర్చికి కొత్త మార్కెట్లు తెరవడంలో సీఐసీ కీలక పాత్ర పోషించాలని సూచించారు. కోవిడ్‌కు ముందు ఏపీ–చైనా మిర్చి వాణిజ్యంపై ప్రయత్నాలు జరిగినప్పటికీ, మహమ్మారి కారణంగా అవి నిలిచిపోయాయని గుర్తు చేశారు.
ఏపీ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు) సరుకు సమీకరణ, నాణ్యత ప్రమాణీకరణ బాధ్యతలు చేపడతాయని, కొనుగోలుదారులను అనుసంధానించడం, ట్రేడ్ ఫైనాన్సింగ్ సౌకర్యాలు కల్పించడం వంటి అంశాల్లో సీఐసీ సహకరించాలని మంత్రి కోరారు. మొదట మిర్చి ఎగుమతులపై పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని సూచించారు.
అలాగే ఏపీ–సింగపూర్ జాయింట్ కమాడిటీ ట్రేడ్ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించి, ఎగుమతిదారులు, ఎంటర్‌ప్రైజ్ సింగపూర్, ఎస్‌జీఎక్స్, సీఐసీ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావాలని ప్రతిపాదించారు.
ఈ సందర్భంగా గ్లోరియా ఊ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులు, అమ్మకందారులు, లాజిస్టిక్స్ సంస్థలు, ఫైనాన్షియల్ భాగస్వాములను అనుసంధానించే డిజిటల్ బీ2బీ మార్కెట్‌ప్లేస్‌గా సీఐసీ పనిచేస్తోందని తెలిపారు. బ్లాక్‌చెయిన్ ఆధారిత డాక్యుమెంట్ భద్రత, ట్రేడ్ డేటా విశ్లేషణ, ఎండ్-టు-ఎండ్ ట్రేసబిలిటీ, సప్లై చైన్ ఫైనాన్స్ వంటి సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని వెల్లడించారు.
