అమరావతి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనమండలిలో అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల మంజూరుపై సభ్యుడు ఏ శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి మాట్లాడారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 9 ప్రభుత్వ జూనియర్ కాలేజీలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కాలేజీల్లో బోధన సిబ్బంది పోస్టులు మంజూరు చేసినట్టు, మరో 5 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరు చేసినట్టు వివరించారు. గతంలో విద్యాశాఖలో సమగ్ర డేటా లేకపోవడంతో ఎక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఏ ఉపాధ్యాయులు ఎక్కడ పనిచేస్తున్నారు అనే సమాచారం అందుబాటులో లేదని చెప్పారు.
ఈ వివరాలను సేకరించేందుకు 20 నెలలు పట్టిందని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల మంజూరులో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌తో ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలను తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన అధ్యాపకుల నియామకం, ల్యాబ్‌ల ఏర్పాటు, పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందజేయడం జరుగుతుందని చెప్పారు.
ఇంటర్ విద్యలో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించామని, విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను ఉచితంగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీల భర్తీకి అవసరమైన అన్ని చర్యలను వేగంగా చేపడతామని లోకేష్ మరోసారి స్పష్టం చేశారు.
