Lokesh Kanagaraj: ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. జి స్క్వాడ్ (G Squad) అనే నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు సోషల్ మీడియాలో లోగోతోపాటు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
‘జి స్క్వాడ్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సంస్థ నుంచి తొలిగా నా అసిస్టెంట్స్, స్నేహితులను పరిచయం చేయాలని.. వారిలోని టాలెంట్ ను బయటకు తీసుకొచ్చేందుకే నిర్మాతగా మారాను. ఈ సంస్థ నుంచి ముందుగా వారి సినిమాలే ఉంటాయి. ఈ సినిమాలను కూడా మీరు ఆదరించాలని.. మీ మద్దతు, ప్రేమ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాన’ని అన్నారు.
అయితే.. జి స్క్వాడ్ నుంచి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలు వస్తాయో రావో మాత్రం లోకేశ్ చెప్పలేదు. తన సృజనాత్మకతతో అద్భుతమైన సినిమాలు తీస్తున్న లోకేశ్ నుంచి నిర్మాతగా కూడా అద్భుతాలే వస్తాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన రజినీకాంత్ (Rajinikanth) తో సినిమా తెరకెక్కిస్తున్నారు.