అమరావతి: రాష్ట్ర భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని, రాబోయే కాలంలో చరిత్ర సృష్టించేది నేటి తరం పిల్లలేనని విద్యా మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం అసెంబ్లీ సందర్శనకు వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గం సుగాలి జెడ్పీ హైస్కూలు విద్యార్థులతో అసెంబ్లీ లాబీలో మంత్రి ముచ్చటించారు. అసెంబ్లీ ఎలా ఉందని, సభలో ఏ అంశాలపై చర్చ జరుగుతోందని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ కార్యాచరణను ప్రత్యక్షంగా చూడటం వల్ల ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుందో అర్థమవుతుందని చెప్పారు.
ఇంగ్లీషులో చదువుకోవడం కెరీర్‌కు అవసరమే అయినా, అమ్మలాగే మాతృభాష అయిన తెలుగును ఎప్పటికీ మర్చిపోవద్దని విద్యార్థులకు సూచించారు. విదేశాల్లో చదువుకున్నప్పుడు మొదట్లో తెలుగులో మాట్లాడటానికి ఇబ్బందిపడ్డ అనుభవాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. అప్పటి అనుభవం తనకు మాతృభాష విలువను మరింతగా అర్థం చేసుకునేలా చేసిందని చెప్పారు. భాషను గౌరవించడమే సంస్కృతిని కాపాడుకోవడం అని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సదుపాయాలపై విద్యార్థుల అభిప్రాయాలు కూడా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. యూనిఫామ్ నాణ్యత ఎలా ఉందని, ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారని, మధ్యాహ్న భోజనం రుచిగా ఉందా, రాగిజావ అందుతోందా అని వివరంగా ప్రశ్నించారు. పిల్లలు తమ అనుభవాలను చెప్పగా, ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు మెరుగుపడేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని నైపుణ్యాలను పెంపొందించుకుంటే రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలరని లోకేష్ చెప్పారు. పాఠశాల విద్యలో నాణ్యత పెంచడం, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. అసెంబ్లీ సందర్శన వంటి అనుభవాలు పిల్లల్లో ప్రజాస్వామ్యంపై అవగాహన పెంచుతాయని పేర్కొన్నారు. ఈ సంభాషణతో విద్యార్థులు ఉత్సాహం పొందగా, లోకేష్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
