అమరావతి: రాష్ట్రంలో క్లస్టర్ బేస్డ్ విధానంతో పారిశ్రామికాభివృద్ధి వేగవంతం చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అసెంబ్లీలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సూపర్-6 హామీల్లో భాగంగా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 22 పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించి ఎకోసిస్టమ్ అభివృద్ధికి చర్యలు చేపట్టామని వెల్లడించారు. రాయలసీమ, అనంతపురంలో ఆటోమోటివ్ క్లస్టర్, కర్నూలులో రిన్యూవబుల్ ఎనర్జీ మరియు సిమెంట్ క్లస్టర్, కడప, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, నెల్లూరులో గ్లాస్ మరియు ఏసీ క్లస్టర్, ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ క్లస్టర్, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్, గోదావరి జిల్లాల్లో ఆక్వా క్లస్టర్, ఉత్తరాంధ్రలో ఫార్మా, మెడికల్ డివైసెస్ మాన్యుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్‌లతో పాటు డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. ఒకే క్లస్టర్‌లో అనుబంధ పరిశ్రమలన్నీ ఉండేలా వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్ అవసరమని చెప్పారు.
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యా సంస్థలతో అనుసంధానం చేసి కోర్సులను అప్‌గ్రేడ్ చేస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. సోలార్ సెల్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు అవసరమైన బీటెక్, ఎంటెక్, రీసెర్చ్ ప్రోగ్రామ్‌ల కోసం తిరుపతి ఐఐటితో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. వేఫర్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు సంబంధించి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. సోలార్ రంగంలో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, టెస్టింగ్, డిజైన్ సెంటర్‌ను తిరుపతి ఐఐటికి తీసుకురావడానికి యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌తో ఒప్పందానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఏసీ తయారీలో ఇప్పటికే దేశంలో తయారయ్యే ఏసీల్లో పెద్ద శాతం ఏపీలోనే తయారవుతున్నాయని, రానున్న రెండేళ్లలో ఇది మరింత పెరుగుతుందని తెలిపారు. డైకిన్, ఎల్‌జీ, బ్లూస్టార్ వంటి కంపెనీలతో భాగస్వామ్యంగా ఐటీఐలను యూనిట్లకు అనుసంధానం చేసి కరిక్యులమ్, ఎక్విప్‌మెంట్, శిక్షణను పరిశ్రమలే అందించే విధంగా ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. యూరప్‌కు పంపి పరీక్షించే ఖరీదైన హీట్ పంప్ టెస్టింగ్ ఫెసిలిటీని రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
పరిశ్రమలతో చేసుకున్న 760 ఎంవోయూలను మంత్రుల బృందం ట్రాక్ చేస్తోందని, ప్రతి సెక్టార్‌కు ఒక ఇండస్ట్రీ లీడర్‌ను బాధ్యతగా నియమించి కోర్సులు, మానవ వనరుల మ్యాపింగ్ చేస్తున్నామని లోకేష్ తెలిపారు. విండ్ ఎనర్జీ రంగంలో సుజలాన్‌తో కలిసి ఐదు గ్రీన్ ఎనర్జీ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ఏటా 12 వేల మంది టెక్నీషియన్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఏఐ అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ కోసం మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్‌తో ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక ఐటీఐని దత్తత తీసుకుని మెకానిక్‌లకు ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇస్తోందని పేర్కొన్నారు. సెయింట్ గోబిన్స్, ఆసియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్స్‌తో కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఏర్పాటు చేసి నిర్మాణ రంగానికి ప్రపంచస్థాయి మానవ వనరులను తయారు చేయనున్నట్లు చెప్పారు.
ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటివరకు 1587 జాబ్ ఫెయిర్లు నిర్వహించి 11,373 కంపెనీల భాగస్వామ్యంతో 1,08,747 మందికి ఉద్యోగాలు కల్పించామని లోకేష్ వివరించారు. లిఫ్ట్ మెకానిక్‌లు, ఎలక్ట్రీషియన్లు, క్వాలిటీ ప్లంబర్ల కొరత ఎక్కువగా ఉందని, మంచి జీతం ఇచ్చినా నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లు దొరకడం లేదని చెప్పారు. ఏపీ ఎస్ఎస్‌డీసీ, సీడాప్, న్యాక్ ద్వారా ఇప్పటికే 73 వేల మందికి శిక్షణ ఇచ్చి 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా లక్షల మందికి శిక్షణ అందుతోందని చెప్పారు. క్యాంపస్‌లలో ఏఐ, మిషన్ లెర్నింగ్ అడాన్ కోర్సుల ద్వారా 3.11 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు.
త్వరలో నైపుణ్యం పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు లోకేష్ తెలిపారు. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్, బిల్డ్ యువర్ ఓన్ రెస్యూమ్ సదుపాయం, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఏఐ బేస్డ్ కోర్సులు, కాన్వర్సేషన్ ఏఐ ద్వారా సెల్ఫ్ అసెస్‌మెంట్, ఏఐ ట్యూటర్‌తో ఇంటర్వ్యూ ట్రైనింగ్, ఉద్యోగ అవకాశాల ఎగ్రిగేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయని చెప్పారు. మార్చి చివరి నాటికి పోర్టల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. నర్సింగ్, పారా మెడికల్ కోర్సులకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉందని, లాంగ్వేజ్ ట్రైనింగ్‌తో ఇప్పటికే కొందరిని విదేశాలకు పంపామని, దీన్ని మరింత విస్తరించాలనే లక్ష్యం ఉందని వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో సీసీటీవీ మానిటరింగ్, ఫేషియల్ రికగ్నిషన్ అమలు చేస్తున్నామని, డైట్, బీఎడ్, ఇంజినీరింగ్ కాలేజీల్లో కూడా ఇదే విధానం అమలు చేస్తామని చెప్పారు. రాబోయే 90 రోజుల్లో న్యాక్‌ను యుద్ధ ప్రాతిపదికన బలోపేతం చేసి ప్రపంచస్థాయి కార్మికులను తయారు చేస్తామని లోకేష్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.
