విశాఖపట్నం: పలు ఐటీ సంస్థలకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నేడు ఉదయం నగరంలోని పార్టీ కార్యాలయంలో 77వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు వరుసగా విచ్చేసి తమ సమస్యలను వివరించగా, ప్రతి ఒక్కరినీ మంత్రి లోకేష్ ఆప్యాయంగా పలకరిస్తూ వినతులు స్వీకరించారు.
స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్‌లో గత నాలుగు దశాబ్దాలుగా నడుస్తున్న విశాఖ విమల విద్యాలయాన్ని ఏకపక్షంగా మూసివేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్కూల్ టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది తెలిపారు. పెండింగ్ జీతాలు చెల్లించడంలో చర్యలు తీసుకోవాలని, అలాగే రెగ్యులర్ స్టాఫ్‌కు స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగావకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
అలాగే, విశాఖ అంబేద్కర్ కాలనీకి చెందిన ఈర్ల అప్పలరాజు తన తండ్రికి ప్రభుత్వం కేటాయించిన ఇంటిని దివకాల గంగారాజు ఆక్రమించాడని, దీనిపై విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే మెడికల్ ఇన్ వాలిడేషన్ స్కీమ్‌ను తమకు అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని కోరుతూ మంత్రి ని సంప్రదించారు.
అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం లోవపాలెం గ్రామానికి చెందిన గనగళ్ల వివేక్, యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు ప్రోద్బలంతో తనపై నమోదైన రౌడీషీట్‌ను రద్దు చేయాలని అభ్యర్థించారు.
ప్రజలు వివరించిన ప్రతీ వినతిని శ్రద్ధగా పరిశీలించి, పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ప్రజలతో ఇంత సమీపంగా, నిరంతరవంగా ఉండటం ప్రభుత్వం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
