ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగాన్ని బలోపేతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా “ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్”ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. శాసనసభలో స్కూల్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఐటీ శాఖలకు సంబంధించిన బడ్జెట్ డిమాండ్లను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన విస్తృతంగా మాట్లాడారు. విద్యారంగంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో ఈ ఏడాది మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేసిన లోకేష్, వచ్చే శాసనసభ సమావేశాల్లో విద్యాశాఖ పనితీరుపై పూర్తి రిపోర్ట్ కార్డును సభ ముందుంచుతామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిని సొంత బిడ్డలా భావించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడం అందరి బాధ్యత అని లోకేష్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే విద్యావ్యవస్థలో ఆశించిన మార్పు సాధ్యమవుతుందని చెప్పారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ విద్యా విధానాలను అధ్యయనం చేయడానికి వస్తున్నాయని, కొన్ని రాష్ట్రాల ప్రతినిధి బృందాలు ఇప్పటికే రాష్ట్రాన్ని సందర్శించాయని తెలిపారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఏపీ విద్యా సంస్కరణలను ఇతర రాష్ట్రాలు పరిశీలించాలని సూచించినట్లు చెప్పారు.
గత ప్రభుత్వ పాలనలో విద్యారంగం తీవ్రంగా దెబ్బతిందని లోకేష్ విమర్శించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని తెలిపారు. ట్రాన్సిట్ పీరియడ్‌ను గుర్తించడానికి రూపొందించిన డ్రాప్ బాక్స్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేసి సుమారు 3 లక్షల మంది పిల్లలను అందులో చేర్చారని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117 కారణంగా సింగిల్ టీచర్ పాఠశాలలు భారీగా పెరిగాయని, దీనివల్ల విద్యార్థుల అభ్యసన సామర్థ్యం తీవ్రంగా పడిపోయిందని తెలిపారు.
అభ్యసన ఫలితాల్లో కూడా రాష్ట్రం వెనుకబడిందని లోకేష్ పేర్కొన్నారు. ఒకప్పుడు అగ్రస్థానాల్లో ఉన్న రాష్ట్రం, జాతీయ స్థాయి సర్వేల్లో 27వ, 21వ, 32వ స్థానాలకు పడిపోయిందని చెప్పారు. అక్షరాస్యత శాతంలో కూడా రాష్ట్రం బీహార్ కంటే దిగువకు వెళ్లిందని కేంద్రంతో జరిగిన చర్చల్లో వెల్లడైందన్నారు. మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అక్షరాస్యతలో టాప్–5లోకి తీసుకువచ్చే బాధ్యత తమదేనని చెప్పారు.
గత ప్రభుత్వ కాలంలో విద్యారంగంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారని లోకేష్ విమర్శించారు. సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ వాస్తవంగా ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. టోఫెల్ కోసం రూ.58 కోట్లకు పైగా ఖర్చు చేసినా ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేదని తెలిపారు. ఐబీ పాఠశాలల కోసం రూ.5 కోట్లు ఖర్చు చేసినా ఒక్క పాఠశాల కూడా సిద్ధం కాలేదన్నారు.
ఉపాధ్యాయులను కూడా గతంలో తీవ్రంగా అవమానించారని లోకేష్ విమర్శించారు. టీచర్లను వైన్ షాపుల వద్ద కాపలాగా పెట్టిన ఘటనలు జరిగాయని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేల పోస్టులను కేవలం 150 రోజుల్లో భర్తీ చేశామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని లోకేష్ చెప్పారు. ప్రస్తుతం వేలాది పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.7,800 కోట్లు అవసరమవుతాయని, ఈ ఏడాది రూ.1,200 కోట్లతో పనులు ప్రారంభించామని తెలిపారు. వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని విస్తరించి వేలాది పాఠశాలల్లో అమలు చేస్తున్నామని చెప్పారు.
విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచేందుకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీపై ప్రత్యేక దృష్టి పెట్టామని లోకేష్ తెలిపారు. పాఠశాలల్లో యాక్టివ్ లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు క్లిక్కర్ టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టుగా 300 పాఠశాలల్లో ప్రారంభించామని చెప్పారు. రాబోయే రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలోని 46 వేల పాఠశాలల్లో దీనిని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. లీప్ యాప్ ద్వారా విద్యార్థుల హాజరు, చదువు పురోగతిపై తల్లిదండ్రులకు సమాచారం చేరేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ప్రభుత్వం ఖర్చులను తగ్గించడంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు లోకేష్ తెలిపారు. స్కూల్ కిట్స్, చిక్కీ, గుడ్ల సరఫరాలో వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.1,000 కోట్ల వరకు ఆదా చేయనున్నామని చెప్పారు. పాఠశాల కిట్లకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు, మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినట్లు తెలిపారు.
ఉన్నత విద్యా రంగంలో కూడా పెద్ద మార్పులు తీసుకొస్తున్నామని లోకేష్ చెప్పారు. గతంలో విశ్వవిద్యాలయాలను రాజకీయ నియామకాలతో భ్రష్టుపట్టించారని విమర్శించారు. ప్రతిభ ఆధారంగా వైస్ ఛాన్సలర్లను నియమించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. గతంలో నియామకాలు జరగకపోవడంతో వేలాది అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 90 రోజుల్లో న్యాయపరమైన సమస్యలను పరిష్కరించి అధ్యాపక నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.
స్కిల్ డెవలప్‌మెంట్ రంగంలో కూడా పెద్ద మార్పులు చేపట్టామని లోకేష్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,500కు పైగా జాబ్ మేళాలు నిర్వహించి లక్ష మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. విదేశీ ఉద్యోగాల కోసం జర్మన్, జపనీస్ భాషలలో శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు.
గ్రంథాలయాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలో ప్రపంచ స్థాయి సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి డిజైన్ ఖరారు చేసినట్లు తెలిపారు. డిజిటల్ లైబ్రరీల ద్వారా విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక యాప్‌ను కూడా తీసుకురానున్నట్లు చెప్పారు.
సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని లోకేష్ అన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన, యోగా, సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు, సైన్స్ ఫెయిర్లు, ఎక్స్‌పోజర్ విజిట్లు వంటి కార్యక్రమాలు పాఠశాలల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాలను బలోపేతం చేసి రాష్ట్రాన్ని విద్యా రంగంలో అగ్రస్థానంలో నిలపడం లక్ష్యమని స్పష్టం చేశారు.
