అసలు మద్యం గురించి చర్చించుకోవాల్సి రావడమేంటి.? మద్యపానం ఆరోగ్యానికి హానికరమని చెబుతుంటాం. పెద్ద పెద్ద అక్షరాలతో హెచ్చరికలు చేస్తుంటాం. ప్రభుత్వాలు మద్యం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల గురించీ, ప్రమాదాల గురించీ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి మరీ ప్రచారం చేస్తుంటాయి.
చిత్రమేంటంటే, ఇక్కడ ప్రత్యక్షంగానో పరోక్షంగానో.. నిత్యం ‘లిక్కర్’కి విపరీతమైన పబ్లిసిటీ లభిస్తోంది. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అంటే అది అతిశయోక్తి కాకపోవచ్చు. తెలంగాణలోనూ మద్యం అమ్మకాలున్నాయ్.. దేశంలో చాలా రాష్ట్రాలు లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం మీద ఆధారపడుతున్నాయి.
కానీ, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంకాస్త భిన్నం. దేశంలో ఎక్కడా దొరకని చిత్ర విచిత్రమైన బ్రాండ్ల మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరుకుతోంది. అదే అసలు సమస్య. అబ్బే, అది విషం కాదు.. అని అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి చెబుతారు. లిక్కర్ అంటే విషం కాక మరేమిటి.? తక్కువ తీవ్రతా.? ఎక్కువ తీవ్రతా.? అన్నది పక్కన పెడితే, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అంటే అది విషంతో సమానమే.!
ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ మద్యం విషయమై చూపుతున్న అత్యుత్సాహం. చిత్ర విచిత్రమైన బ్రాండ్ల మద్యం తయారవుతోన్నది వైసీపీకి చెందిన నాయకుల డిస్టిలరీల్లో.. అన్నది విపక్షాల ఆరోపణ. ‘మేం అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తాం..’ అని ఎన్నికల ప్రచారంలో చెప్పిన వైసీపీ, తమ నాయకులతో మద్యం వ్యాపారం ఎలా చేయిస్తోంది.? అంటే, దానికి వైసీపీ వద్ద సమాధానమే దొరకదు.
ఇక, సంక్షేమ పథకాల పేరుతో వేల కోట్లు, లక్షల కోట్లు జనాల్లోకి పంపుతున్నామని గర్వంగా చెప్పుకుంటోంది వైసీపీ. మరి, ఆ డబ్బులు ఏమైపోతున్నాయ్.? అందులో మెజార్టీ, లిక్కర్ సేల్స్ రూపంలోకి మారిపోతున్నాయ్.. కొంత మొత్తం ప్రభుత్వ ఖజానాకీ, ఇంకొంత మొత్తం డిస్టిలరీలకీ వెళుతోంది. ఆ డిస్టిలరీలు మళ్ళీ వైసీపీ నేతలవే.
సో, సంక్షేమ పథకాల సొమ్ము, అటు తిరిగి, ఇటు తిరిగి వైసీపీ నేతల జేబుల్లోకి వెళుతోందన్నది విపక్షాలు తెరపైకి తెస్తోన్న లాజిక్. ‘నాన్సెన్స్.. ఆ వ్యాపారాలతో వైసీపీకి సంబంధం లేదు..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పగలరా.?
ఏపీలో లిక్కర్ తాగితే మందుబాబులకు ‘కిక్కు’ ఎక్కడంలేదుగానీ, జేబుకు చిల్లుపడుతోంది.. ఆరోగ్యం గుల్ల అవుతోంది. కానీ, మద్యం వ్యాపారం చేస్తోన్న ప్రభుత్వానికీ, ప్రభుత్వంలోనివారికీ మాంఛి ‘కిక్కు’ (అదేనండీ ఆదాయం) లభిస్తోంది. అద్గదీ అసలు సంగతి.