ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైకి లేఖాస్త్రం సంధించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి బినామీగా తనను అభివర్ణించడంపై లింగమనేని ఆ లేఖాస్త్రంలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘అప్పుడు చంద్రబాబే కాదు, ఇంకెవరు అధికారంలో వున్నా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నా గెస్ట్ హౌస్‌ని అద్దెకు ఇచ్చేవాడినే..’ అంటూ లింగమనేని రమేష్ ఆ లేఖాస్త్రంలో ప్రస్తావించారు. తనకు రాజకీయాలు ఆపాదించవద్దనీ ఆయన విజ్ఞప్తి చేశారు.
మరోపక్క, అభివృద్ధి చెందిన హైద్రాబాద్‌ని కాదని, విజయవాడ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాల్ని విస్తరించి, ఆ ప్రాంత అభివృద్ధిని కాంక్షించారంటూ లింగమనేని రమేష్‌పై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సానుభూతి వ్యక్తం చేస్తుండడం గమనార్హం. వైసీపీ నేతలూ కొందరు ఈ భావనతో ఏకీభవిస్తున్నారు.
ఇక్కడ వచ్చిందల్లా ఒకే ఒక్క సమస్య. లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్‌ని చంద్రబాబు వినియోగించుకోవడం. ఒకవేళ చంద్రబాబు గనుక ఆ గెస్ట్ హౌస్‌లో నివాసం ఏర్పాటు చేసుకోకుండా వుండి వుంటే, అసలు ఈ సమస్యలే వచ్చి వుండేవి కావు. అయితే, గతంలోనూ లింగమనేనిపై ‘చంద్రబాబు బినామీ’ అనే విమర్శలొచ్చాయి. కానీ, అప్పుడాయన లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిపైకే లేఖాస్త్రం సంధించారు.
రాజకీయాల్లో ‘బినామీ’ అనే మాట తరచూ విన్పిస్తుంటుంది. శేఖర్ రెడ్డిని చంద్రబాబుకి బినామీ అన్నారు. మేఘా సంస్థ కూడా చంద్రబాబుకి బినామీనే అని గతంలో వైసీపీ ఆరోపించిన మాట వాస్తవం. నవయుగ సంగతి సరే సరి. కానీ, ఏమయ్యింది.? నవయుగ చేతిలో ఇప్పటికే వున్న కాంట్రాక్ట్‌ని రద్దు చేసి, కొత్తగా అప్లయ్ చేసుకోవాలని జగన్ సర్కార్ సూచించింది.
గతంలో ఏ మేఘా సంస్థపైన అయితే ఆరోపణలు చేసిందో అదే మేఘా సంస్థకు వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనుల్ని అప్పగించింది. శేఖర్ రెడ్డి సంగతి సరే సరి. లేఖాస్త్రం సంధించడం కాకుండా, వైఎస్ జగన్ ప్రభుత్వానికి సరెండర్ అయిపోతే, లింగమనేని గెస్ట్ హౌస్‌కి కూడా ఇబ్బందులు వుండకపోవచ్చు. పైగా, అధికారిక కార్యకలాపాల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ భవనాన్ని వాడుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
