2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. నిజానికి, ఘోర పరాజయంపై వైసీపీ నేతలు ఓ స్పష్టతతోనే వున్నా, వైసీపీ అధినాయకత్వం.. తమ పార్టీ నాయకుల్ని ఏమార్చింది.
నిజాలేవీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు చేరకుండా సజ్జల రామకృష్ణా రెడ్డి అనే ఓ కోటరీ, వైసీపీని సర్వనాశనం చేసిందని వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. అలాంటి ఓ కోటరీకి చెందిన ఇంకో నాయకుడు విజయ సాయి రెడ్డి వైసీపీని ఇటీవల వీడారనుకోండి.. అది వేరే సంగతి.
ఇంతకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనుగడ 2029 ఎన్నికల్లో ఎలా వుండబోతోంది.? ఈ విషయమై తాజాగా ఓ సర్వే ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. వైసీపీకి 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాలేదు.? విపక్షంలో వున్న వైసీపీ, సమర్థవంతంగా పని చేస్తోందా.? లేదా.? కూటమి లుకలుకల సంగతేంటి.? వంటి అంశాలపై ఆ సర్వే ఆసక్తికరమైన వివరాల్ని వెల్లడించింది.
వైసీపీకి 30 శాతానికి పైగా ఓటు బ్యాకు 2029 ఎన్నికల్లోనూ వచ్చే అవకాశం వుందనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేశారు. అయితే, 2024 ఎన్నికలతో పోల్చి చూస్తే, వైసీపీ ఏమాత్రం పుంజుకునే అవకాశం లేదన్నది ఆ అంచనా సారాంశం.
కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతోషంగానే వున్నారు. వైసీపీ అరాచక పాలనని ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ప్రధానంగా రోడ్లు, వైసీపీని దారుణంగా దెబ్బ తీశాయి గత ఎన్నికల్లో. ఆ నెగెటివిటీ వైసీపీ మీద 2029 ఎన్నికల్లో కూడా కొనసాగే అవకాశాలున్నాయి.
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి వచ్చే ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తుందని మెజార్టీ ప్రజలు విశ్వసిస్తున్నారు. కూటమి కలిసి వున్నంతకాలం, వైసీపీకి కష్టకాలమేనన్నది సర్వేలో చాలామంది సాధారణ ప్రజలు చెప్పినమాట.
వైసీపీ హయాంలో జగన్ చెబుతున్న సంక్షేమం పట్ల ఓటర్లెవరూ సంతృస్తిగా లేరు. అసలు ఆ సంక్షేమాన్ని జనం ఎప్పుడో మర్చిపోయారు. సంక్షేమం పేరుతో పబ్లిసిటీ స్టంట్లను వైసీపీ చేసిందనే అభిప్రాయం జనంలో వుంది.
కాగా, 2029 ఎన్నికల నాటికి జనసేన పార్టీ సొంతంగా ఎదుగుతుందా.? అన్నదానిపై సర్వేలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమిలో టీడీపీ వైపే ప్రజలు పూర్తి స్థాయి సానుకూలతతో వున్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సర్వేలో తేలింది.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే, వైఎస్సార్సీపీ 2029 ఎన్నికల్లో ఇంకోసారి చతికిలపడే అవకాశాలే సుస్పష్టం. ‘జగన్ 2.0’ అని వైసీపీ శ్రేణులు చేస్తున్న హడావిడి జస్ట్ హంబక్ అంతే.! వైసీపీని వైసీపీ నాయకులు వీడిపోతున్నది, పార్టీ అధినాయకత్వం ప్రదర్శిస్తున్న మోనార్కిజం వల్లనే.!
