ఒక్క రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు.. అన్నారు. ఒకటీ లేదు, మూడే లేదు. మొత్తంగా ఇప్పుడు అయోమయం.! అమ్మ ఒడి అన్నారు.. దాంట్లో భాగంగా కోరినవారికి ల్యాప్‌టాప్ అన్నారు. అదిప్పుడు మాయమై, కొత్తగా ట్యాబులు చేతికిస్తామంటున్నారు. అవైనా చేతికి వస్తాయా.? రావా.?
అమ్మ ఒడి పథకం నుంచి రెండు వేల రూపాయల కోత విధిస్తూ, అక్కడికేదో తాము నిజాయితీగా వ్యవహరిస్తున్నట్లు వైఎస్ జగన్ సర్కారు చెబుతోంది. 15 వేలు ఇవ్వాల్సింది పోయి, అందులోంచి రెండు వేల రూపాయలు కోతెందుకు.? అంటే, టాయిలెట్ల నిర్వహణ కోసమట. మరో వెయ్యి రూపాయలు, ఇంకో అవసరాలకట.
అంతేనా.? ఇంకేమన్నా వుందా.? ముందు ముందు మరో మూడు వేలు, ఆపై ఇంకో ఐదు వేలు కోత వేసేసి.. మొత్తంగా గుండు సున్నా చుట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు.
ఇంతకీ, ఇస్తానన్న ల్యాప్‌టాప్‌ల విషయంలో ఎందుకు వైఎస్ జగన్ సర్కారు వెనక్కి తగ్గినట్లు.? ప్రభుత్వం గతంలో ప్రకటించిన కాన్ఫిగరేషన్‌తో ల్యాప్‌టాప్ అంటే 18 వేల రూపాయల్లో లభించే అవకాశం లేదు. బొత్తిగా విషయ పరిజ్ఞానం లేకుండా ప్రభుత్వ పెద్దల నుంచి ప్రకటనలు ఎలా వస్తాయ్.? అంటే, ఇదిగో ఇలాగే.!
బైజూస్ సంస్థతో ఒప్పందం.. విద్యార్థులకు ల్యాప్‌టాప్లు.. ఈ ఏడాది నుంచే ప్రయోగాత్మకంగా అమలు.! ఇది కొత్త వాదన. బైజూస్ అంటే, అదేమీ స్వచ్ఛంద సంస్థ కాదు. ఆ సంస్థతో ఒప్పందం వెనుక, తెరవెనుక మతలబులేవో వున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇంతకీ, ట్యాబుల కొనుగోళ్ళ సంగతేంటి.? దాని కోసం ప్రభుత్వం వెచ్చించబోయే నిధులెన్ని.? ఏ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ప్రపంచంతో పోటీ పడే స్థాయిక మన విద్యార్థులు.. అంటున్నారు సీఎం వైఎస్ జగన్.
నిజానికి, మన విద్యార్థులు ఎప్పటినుంచో ప్రపంచంతో పోటీ పడుతున్నారు. ఇదేమీ కొత్త విషయం కాదు. కాకపోతే, పబ్లిసిటీ కొత్తగా జరుగుతోందంతే. టెన్త్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఒక్కసారి గతంతో పోల్చి చూసుకుంటే.. పోటీలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతుందో, వెనక్కి దిగజారిపోతోందో అర్థమవుతుంది.