ఏపీ, తెలంగాణ వరద బాధితులకు ఇంకా విరాళాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు చాలామంది కోట్లలో విరాళాలు ప్రకటించారు. నిన్ననే చిరంజీవితో పాటు కొంత మంది హీరోలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళాల చెక్కులను కూడా అందజేశారు. అయితే తాజాగా కుమారి ఆంటీ కూడా సాయం ప్రకటించింది. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో మీది మొత్తం తౌజెండ్ అయింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా అంటూ ఆమె చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అయింది.
దాంతో యూట్యూబర్లు, ఫుడ్ వ్లాగర్లు వెళ్లి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వీడియోలను విపరీతంగా వైరల్ చేసేశారు. దెబ్బకు కుమారి ఆంటీ ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. సినిమాల ప్రమోషన్లతో పాటు అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రామ్స్ లలో కూడా పాల్గొంటూ బాగానే సంపాదిస్తోంది. అప్పటి నుంచి ఆమె ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణ వరద బాధితుల కోసం తన వంతుగా ముందుకొచ్చి సాయం చేసింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.50వేల చెక్కును అందజేసింది.
తన కొడుకు, కూతురు, భర్తతో కలిసి ఆమె ఈ చెక్కును అందజేసింది. అయితే ఆమె ఉదారతను చూసి అంతా మెచ్చుకుంటున్నారు. ఒక చిరు వ్యాపారం చేసుకునే మహిళకు ఉన్నంత గొప్ప మనసు.. చాలా మంది హీరోలు, బడా బిజినెస్ పర్సన్లకు కూడా లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి కుమారి ఆంటీ పేరు మార్మోగిపోతోందనే చెప్పుకోవాలి.