తెలంగాణ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో తమ రాష్ట్రం తెలంగాణకి ఏంటి సంబంధమని ప్రశ్నిస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పంచాయితీ నడుస్తోంది. ఆ గొడవలేవో ఆ రాష్ట్రంలో చూసుకోవాలి. ఆ రెండు పార్టీలకీ తెలంగాణలో స్థానం లేదు..’ అంటూ కేటీయార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిజమే, తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదు. కానీ, ఆ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెర వెనుకాల మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది కేసీయార్ నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితి. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో గులాబీ పార్టీ (ఇప్పుడైతే బీఆర్ఎస్.. అప్పట్లో అది టీఆర్ఎస్) పూర్తి సహాయ సహకారాలు అందించింది.
తెలంగాణ మంత్రులు, ఏపీకి వెళ్ళి.. కొన్ని కులాల ఓటు బ్యాంకుల్ని గంప గుత్తగా వైసీపీ వైపు మళ్ళేలా చేయడంలో తమవంతు కృషి చేసిన సంగతి తెలిసిందే. ఇంతా చేసేసి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో తమకేంటి సంబంధం.? అని కేటీయార్ అమాయకంగా ప్రశ్నించేస్తున్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వుంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితిలో వున్నారు. ఆ ఇద్దరూ 2018 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచినవాళ్ళే కదా.! వైసీపీలా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా పీకెయ్యలేదు. టీడీపీకి నేతలున్నారు, కార్యకర్తలున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై, టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేయడం తప్పెలా అవుతుంది.?
ఇక, వైఎస్ జగన్ సహా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్.. వీళ్ళంతా తనకు మిత్రులని కేటీయార్ చెప్పుకొచ్చారు. హైద్రాబాద్‌లో ర్యాలీలకు అనుమతులు ఎందుకు ఇవ్వడంలేదని లోకేష్, కేటీయార్‌ని ప్రశ్నించారట కూడా. ‘తెలంగాణ ఉద్యమంలోనూ ఐటీ రంగానికి ఇబ్బంది రాకుండా చూసుకున్నాం.. ఇప్పుడూ అదే చేస్తున్నాం.. హైద్రాబాద్‌లో అన్ని ప్రాంతాలకు చెందినవారూ వున్నారు. అందరూ సఖ్యతగా వున్నారు. ఏపీ రాజకీయాల్ని ఇక్కడికి తీసుకొచ్చి, ఇక్కడి వాతావరణం చెడగొట్టొద్దు..’ అంటున్నారు కేటీయార్.
మరోపక్క, చంద్రబాబు అరెస్టుని పలువురు టీఆర్ఎస్ నేతలూ ఇప్పటికే ఖండించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలూ ఖండించడం చూశాం. కేటీయార్ అన్నంతమాత్రాన ఏపీ – తెలంగాణ రాజకీయాల మధ్య లింకు లేదని అనగలమా.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి, వైసీపీ నుంచి సహకారం అందకుండా వుంటుందా.? ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో వైసీపీకి, గులాబీ పార్టీ సహాయ సహకారాలు అందకుండా వుంటాయా.?
ఏపీలో రోడ్లు బాగాలేవని ఆ మధ్య విమర్శించి, ఆ తర్వాత నాలిక్కరచుకున్నారు కేసీయార్. అంతేనా, ఏపీలో కరెంటు లేక, కరెంటు తీగల మీద జనం బట్టలు ఆరేసుకుంటున్నారంటూ తెలంగాణ మంత్రులు కొందరు సెటైర్లు వేశారు. ఏపీ రాజకీయాలతో సంబంధం లేకుండానే గులాబీ పార్టీలు ఈ గిల్లి కజ్జాలకు తెరలేపుతున్నారా.?