Krishnavamsi: క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ణవంశీ తాజా చిత్రం ‘రంగమార్తాండ’ ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో భాగంగా చిత్ర బృందం ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఈ సందర్భంగా డైరెక్టర్ క్రిష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. ఈ చిత్రంలోని నటీనటుల గురించి ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
‘ ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రను బలంగా తీర్చిదిద్దాం. మా ఇంట్లో ఎలాంటి నిర్ణయాలు అయినా తనే తీసుకుంటుంది. ఒక గృహిణిగా నిర్వర్తించాల్సిన అన్ని విధులు తానే చూసుకుంటుంది. ఆ స్పూర్తితోనే ఇందులో ఆమె పాత్రను డిజైన్ చేశాను. రమ్యకు తన అందమైన కళ్ళే ప్రధాన ఆకర్షణ. ఈ సినిమాలో ఆ కళ్ళతోనే అభినయం పలికించింది. మేకప్, కాస్ట్యూమ్ కి సంబంధించి తనే అన్ని దగ్గరుండి చూసుకుంది క్లైమాక్స్లో వచ్చే ఓ సన్నివేశాన్ని 36 గంటల పాటు చిత్రీకరించాం. ఆ సీన్ చేసేటప్పుడు రమ్య కి కన్నీళ్లు వస్తున్నా.. కంట్రోల్ చేసుకుని మరి నటించింది..
తన నటన చూసి నాకు కూడా కన్నీళ్లు ఆగలేదు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఇక బ్రహ్మానందం విషయానికొస్తే ఆయన ఇమేజ్ కి పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో పోషించారు. ఇందులో ఆయన చక్రి అనే పాత్ర లో కనిపిస్తారు. ఆయన క్యారెక్టర్ కచ్చితంగా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది. ఒక మంచి అనుభూతిని మిగిల్చే సినిమా ‘రంగ మార్తాండ’ ‘ అని చెప్పారు.
ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, ఆదర్శ బాలకృష్ణ ఇందులో ఇతర తారాగణం. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇటీవల వేసిన ప్రీమియర్ షోలకు మంచి స్పందన లభించింది.