రెబెల్ స్టార్ కృష్ణంరాజు, తన వారసుడు ప్రభాస్ గురించి మాట్లాడుతూ గొప్ప స్టార్ అవుతాడు అని అనుకున్నాను కానీ ఈ ప్యాన్ ఇండియా స్థాయి అస్సలు ఊహించలేదు అని అన్నారు. ప్రభాస్ తన నటనా జీవితంలో 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. తన మొదటి సినిమా ఈశ్వర్ ఈరోజే అంటే 28 ఏప్రిల్ న 20 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. 2002, ఏప్రిల్ 28న మొదటి షాట్ కు క్లాప్ కొట్టి కృష్ణంరాజు ప్రభాస్ ను దీవించారు. మొదటి సినిమా నుండి ఒక్కో మెట్టూ ఎదుగుతూ ప్రభాస్ ఈ స్థాయికి చేరుకున్నారు.
ప్రభాస్ 20 ఇయర్స్ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభాస్ అభిమానులు కేక్ కట్ చేసి కృష్ణంరాజు ఇంట్లో సెలెబ్రేట్ చేసారు. ఈ వేడుకకు ఈశ్వర్ చిత్ర దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ, “మా ప్రభాస్ హీరోగా పరిచయమై అప్పుడే 20 ఏళ్ళు గడిచిపోయాయా అని అనిపిస్తోంది. నిజానికి ప్రభాస్ ను మొదట మేమె పరిచయం చేద్దామని అనుకున్నాం కానీ జయంత్ తో పాటు అశోక్ కుమార్ వచ్చి ప్రభాస్ ను లాంచ్ చేసే బాధ్యత ఇవ్వమని అడిగారు. కథ వినగానే బాగా నచ్చింది. అన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయని ఎస్ చెప్పాం. సినిమాను చాలా బాధ్యతతో తెరకెక్కించారు. మంచి లాంచ్ దక్కింది. ఈశ్వర్ చూసాక ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని ఊహించాం కానీ ఈ స్థాయి మాత్రం అస్సలు అనుకోలేదు. ప్యాన్ ఇండియా స్టార్ గా ఈరోజు ప్రభాస్ ఎదిగాడంటే కచ్చితంగా అతని శ్రమ, పట్టుదల, అభిమానుల అండదండలు కారణం. అతను మరింత ఎత్తుకు ఎదగాలని, మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను” అని అన్నారు.
ఈశ్వర్ దర్శకుడు జయంత్ మాట్లాడుతూ “నేను పరిచయం చేసిన ఒక హీరో ఈరోజు ప్యాన్ ఇండియా హీరో అవుతాడని అస్సలు అనుకోలేదు. ప్రభాస్ గొప్పవాడు. ఈశ్వర్ సమయంలో ఎలా ఉన్నాడో ఈ మధ్య కలిసినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. నా హీరో ఈ రేంజ్ కు వెళ్లడం అనేది మర్చిపోలేని అనుభూతి” అని అన్నారు.
ఈశ్వర్ నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ, “ఈశ్వర్ సినిమాతో నిజానికి మా అబ్బాయిని హీరో చేద్దామని అనుకున్నాను కానీ అప్పుడే సినిమాల్లోకి రావడం కరెక్ట్ కాదేమో అనిపించింది. చాలా మందిని పరిశీలించి చివరికి ప్రభాస్ అయితే బాగుంటాడు అనిపించింది. కృష్ణంరాజును కలిసి ఆయన ఓకే అనడంతో ఈశ్వర్ పట్టాలెక్కింది. ప్రభాస్ ఆటిట్యూడ్ అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉన్నాయి. ఈశ్వర్ సినిమా నిన్న, మొన్న తీసినట్లు ఉంది. అప్పుడే 20 ఏళ్ళు అయ్యాయా అంటే ఆశ్చర్యంగా ఉంది” అని అన్నారు.
కృష్ణంరాజు భార్య శ్యామల మాట్లాడుతూ, “ప్రభాస్ ను హీరో చేస్తున్నాం అనగానే రామానాయుడు స్టూడియో నుండి అన్ని రోడ్లు నిండిపోయాయి. మేము స్టూడియోకు వెళదామనుకుని కూడా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అంతమంది అభిమానులు వచ్చారు. వాళ్ళ అండదండల తోనే ప్రభాస్ ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రభాస్ కు నేనే పెద్ద అభిమానిని. ప్రభాస్ ఇలాగె ఇంకా ఎత్తుకి ఎదగాలని అనుకుంటున్నా” అని అన్నారు.
ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు జె ఎస్ ఆర్ శాస్త్రి మాట్లాడుతూ “ప్రభాస్ హీరోగా పరిచయమై 20 ఏళ్ళు అయింది. ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అసలు ఈ వేడుకను భారీగా చేయాలనుకున్నాం కానీ కోవిడ్ సమస్య వల్ల కుదరలేదు” అని అన్నారు.