Kota: తన అనారోగ్యానికి గురైనట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. వదంతులు నమ్మొద్దని ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. తాను మృతి చెందినట్టు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఓ వీడియోలో మాట్లాడారు.
ఈ ఉదయం నుంచీ పదుల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. ఇటువంటి వార్తలు ఎలా పుట్టిస్తారో అర్ధం కావడం లేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నా. కానీ.. నేను చనిపోయానంటూ రూమర్లు బయటకొచ్చాయి. దీంతో పోలీసులు కూడా మా ఇంటికి వచ్చారు. ఇటువంటి అవాస్తవాలను ప్రచారం చేసే వాళ్లను శిక్షించాలి. రేపటి ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకుందామని నేను ఎదురుచూస్తుంటే ఇటువంటి దారుణమైన వార్తలు వినాల్సి వస్తోంది. అందరికీ క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియోలో మాట్లాడుతున్నాను’ అని అన్నారు.
కోట శ్రీనివాసరావు మేనేజర్ కూడా ఈ వార్తలను ఖండిస్తూ.. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. గతంలో కూడా కోట ఆరోగ్యంపై పలు వార్తలు హల్ చల్ చేశాయి.