న్యూఢిల్లీలోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్ భాగస్వామ్యంతో, హైదరాబాద్ కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో మూడవ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ బంజారాహిల్స్‌లోని ఎల్.వి. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. 2025 డిసెంబర్ 1న జరిగిన ఈ వేడుకకు అన్ని వయస్సుల వారికి ఉచిత ప్రవేశం కల్పించడంతో ప్రేక్షకులు విస్తృతంగా హాజరయ్యారు. వివిధ జానర్లలోని ఆకట్టుకునే కొరియన్ సినిమాలు స్క్రీనింగ్ చేయడంతో పాటు, ఫేస్ పెయింటింగ్, హాంబోక్ ట్రైయల్స్, కొరియన్ కాలిగ్రఫీ, కొరియన్ నాట్స్, థీమ్ ఫోటో జోన్ల వంటి స్పెషల్ ఆకర్షణలు సందర్శకులకి అసలైన కొరియన్ కల్చర్ అనుభూతిని అందించాయి.
ఈ ఏడాది ఫెస్టివల్‌కి ప్రధాన ప్రత్యేకతగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-షిక్ హాజరై అభిమానులతో మీట్-అండ్-గ్రీట్, ఇంటరాక్టివ్ సెషన్‌లో పాల్గొన్నారు. ఎక్స్‌ట్రార్డినరీ అటార్నీ వూ, డాక్టర్ రొమాంటిక్, వాగబాండ్ వంటి సూపర్‌హిట్ కొరియన్ డ్రామాలు తెరకెక్కించిన యూ ఇన్-షిక్ రావడంతో తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఉత్సాహం కనిపించింది.
ప్రెస్ మీట్‌లో యూ ఇన్-షిక్ మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. ఇండియాకి రావడం ఇదే మొదటి సారి. హైదరాబాద్ బిర్యానీ అద్భుతంగా ఉంది. నా డ్రామాలు, షోల గురించి ఇక్కడి ప్రేక్షకులు చాలా డీటెయిల్‌గా మాట్లాడటం నన్ను ఎంతో ఆనందపరిచింది. భవిష్యత్తులో తప్పకుండా ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నాను” అని చెప్పారు.
కొరియన్ యాక్టింగ్ అంబాసిడర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ రావడం ఆనందంగా ఉంది. చుక్కపల్లి సురేష్‌కి థాంక్యూ. కొరియన్ టాప్ డైరెక్టర్ యూ ఇన్-షిక్‌తో వేదిక పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కొరియా–ఇండియా కల్చర్ మరియు ఎంటర్టైన్మెంట్‌లో కలిసి మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని ఆశిస్తున్నాం” అన్నారు.
కొరియా గౌరవ కాన్సుల్ జనరల్ సురేష్ చుక్కపల్లి మాట్లాడుతూ, “ఇండియా–కొరియా కల్చర్‌లో చాలా సామ్యాలు ఉన్నాయి. కుటుంబానికి, విలువలకు, సంస్కృతికి ఇచ్చే గౌరవం ఒకటే. అయోధ్యలో కొరియన్ ప్రిన్సెస్ మెమోరియల్ ఉంది. ప్రతి సంవత్సరం 50 వేల కొరియన్స్ అక్కడికి వస్తారు. ఇండియాకి భారీ వ్యూయర్‌షిప్ ఉంది. కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇప్పుడు తెలుగు, హిందీలో డబ్ అవుతున్నాయి. యూ ఇన్-షిక్ చేసిన డ్రామాలపై ఇక్కడ ప్రేక్షకులు చూపుతున్న ఆసక్తి చాలా గొప్ప విషయం. భవిష్యత్‌లో కొరియన్ మేకర్స్ హైదరాబాద్‌లో షూట్ చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు అందించాలనేది మా లక్ష్యం. ఇప్పుడు కొరియాలో షూటింగ్ చాలా ఖరీదైంది. మనం బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుత చిత్రాలు హైదరాబాద్‌లోనే చేశాం. కాబట్టి ఇండియా–కొరియా కలిసి మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాం” అని తెలిపారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ ఫెస్టివల్ కొరియన్ సినిమాలు, డ్రామాలపై ఇండియన్, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల ప్రేమను మరోసారి చూపించింది. యూ ఇన్-షిక్ ఇండియన్ మార్కెట్ కోసం సినిమాలు చేయాలని ప్రకటించడంతో భవిష్యత్‌లో రెండు ఇండస్ట్రీల మద్య కొత్త కలాబరేషన్లు రావచ్చని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
