NTR30: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ‘ఎన్టీఆర్ 30’ ఈరోజు లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డైరెక్టర్ కొరటాల శివ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.
‘ నా సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తో రెండోసారి సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. మనం విస్మరించిన ప్రదేశాలు, తీరప్రాంతాల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ప్రశాంతతకి దగ్గరగా మనుషులకి దూరంగా ఉంటారు. వీళ్లు దేవుడికి, చావుకి భయపడరు. మరి దేనికి భయపడతారనే విషయాన్ని మీరు తెర మీదే చూడాలి. సినీ ప్రియులకు, అభిమానులకు ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను. నా కెరియర్లో ఇది అత్యుత్తమమైన సినిమా కాబోతుంది’ అని తెలిపారు.
ఈ చిత్రంలో దివంగత అందాల నటి శ్రీదేవి తనయ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నందమూరి తారకరామా ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 2016 లో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ఎంతటి హిట్ అయిందో తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.