పని (అధికారం) వుంటే, కన్నూ మిన్నూ కానక నోటకొచ్చినట్లు బూతులు తిడతాం. అదే పని (అధికారం) లేకపోతే, మూసుకుని మూలన కూర్చుంటాం.! ఇదీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఉవాచ.
చాన్నాళ్ళ తర్వాత కొడాలి నాని మీడియా ముందుకొచ్చారు. ఈ క్రమంలో ‘ఈ మధ్యన యాక్టివ్‌గా లేరు కదా.?’ అని మీడియా ప్రతినిథి ఒకరు ప్రశ్నిస్తే, ‘పనిలోంచి నిన్ను తీసేస్తే, యాక్టివ్‌గా వుంటావా.? ఇలా మైక్ పట్టుకుని తిరగ్గలవా.? అధికారం లేదు.. అంటే, మాకు పని లేదు. యాక్టివ్‌గా ఎలా వుంటాం.?’ అని కొడాలి నాని సమాధానమిచ్చారు.
రాజకీయమంటే ప్రజా సేవ.! అధికారంలో వున్నా, లేకున్నా.. ప్రజలతో మమేకమై వుండాలి. కొడాలి నాని గతంలో అలానే వుండేవారు. కాబట్టే, గుడివాడ నుంచి పలుమార్లు మంచి విజయాల్ని అందుకున్నారాయన. అలాంటి కొడాలి నాని, పని లేకపోతే యాక్టివ్‌గా ఎలా వుంటాం.? అని ప్రశ్నించడమేంటో.!
వైసీపీ అధికారం కోల్పోయాక, ఏ క్షణాన అయినా కొడాలి నాని అరెస్టవుతారన్న ప్రచారం జరుగుతూనే వుంది. అయితే, ఇంతవరకు కొడాలి నానిని అరెస్టు చేసే దిశగా పోలీసులు ఎలాంటి ముందడుగూ వేయలేదు.
వైసీపీ హయాంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు కొడాలి నాని. సన్న బియ్యానికి సంబంధించి సంచుల కొనుగోళ్ళలో స్కామ్ జరిగిందని అప్పట్లో పెద్దయెత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కేసుకి సంబంధించి తెరవెనుక వ్యవహారాలు నడుస్తున్నాయ్.. అన్నది కూటమి ప్రభుత్వ వాదన.
ఇటీవల గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత, కొడాలి నాని అరెస్టు ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. వంశీ, నాని కలిసి వైసీపీ హయాంలో కాసినోలు నిర్వహించారన్న ఆరోపణలున్న సంగతి తెలిసిందే.