తను ఎదుగుతూ మరో పదిమంది ఎదగడానికి సహాయం చేయడం అన్నది చాలా గొప్ప విషయం. తాను అనుభవించిన కష్టం తెలుసు కాబట్టి మరొకరు ఆ కష్టం పడకుండా ఉండేందుకు బాసటగా నిలబడటం అద్భుతమైన సంకల్పం. అలాంటి సంకల్పం తో ముందుకెళ్తున్నాడు యువ హీరో కిరణ్ అబ్బవరం. రాజా వారు రాణిగారితో హీరోగా కెరీర్ మొదలు పెట్టిన కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు వాటిలో కొన్ని విజయాలు మరికొన్ని అపజయాలు ఇలా కెరీర్ లో అతి తక్కువ టైం లోనే ఎత్తు పల్లాలు చూశాడు.
అందుకే క తో తన అసలు సత్తా ఏంటన్నది చూపించాడు. క సక్సెస్ తో కెరీర్ లో కొత్త జోష్ నింపుకున్న కిరణ్ అబ్బవరం నెక్స్ట్ దిల్ రూబాతో రాబోతున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం స్పీచ్ ప్రేక్షకులను అలరించింది. కృష్ణానగర్ లో మొదలైన తన ప్రయాణం ఇక్కడిదాకా వచ్చింది. ఐతే తనలా చాలామంది కాదు కాదు తనకంటే ఎక్కువ టాలెంట్ ఉన్న చాలామంది ఉన్నారు. వారు ఇక సినిమాలు చేయలేమని వెళ్లిపోతున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఐతే తాను ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో అలాంటి ఒక 10 మందికి అకాడమేట్ చేస్తానని అన్నాడు కిరణ్ అబ్బవరం.
పరిశ్రమ బాగుండాలంటే సక్సెస్ ఫుల్ సినిమాలు రావాలి. అలా రావాలంటే కొత్త రక్తం పరిశ్రమలో ఉండాలి. ఆ ఉద్దేశంతోనే తను పడిన కష్టం మరొకరు పడకూడదు.. సినిమాలను వదిలి వెళ్లకూడదు అనే కిరణ్ అబ్బవరం చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగానే అతని గొప్ప హృదయాన్ని చాటి చెబుతుంది.
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలగాలని ఎంతోమంది కలలు కంటూ వస్తారు. కానీ కనిపించేంత ఈజీగా అక్కడ అవకాశాలు దొరకవు అన్న విషయం తర్వాత అర్ధమవుతుంది. ఈ క్రమంలో చాలామంది ఇక మన వల్ల కాదని తమ ప్రయత్నాలు ఆపేస్తారు. ఐతే అలాంటి వారికి తోడుగా నేనుంటా అంటూ ముందుకొస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఆయన చేసే సాయం ఎంత ఏంటి అన్నది పక్కన పెడితే దిల్ రూబా ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం ఇచ్చిన ప్రోత్సాహం వెలకట్టలేనిది. హీరోగా తాను ఉన్న ఈ స్థాయిలోనే కిరణ్ అబ్బవరం ఇంత గొప్ప సంకల్పం చేయడం నిజంగానే అతని మంచి మనసుకి హ్యాట్సాఫ్ అని చెప్పాల్సిందే.