ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అధికారంలో లేని ఈ ఇద్దరు నేతలు, రాజకీయంగా ఎదురుదెబ్బలు తిన్న నేపథ్యంలో, వాటర్ పాలిటిక్స్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుంటున్నారన్న విమర్శలు టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లకు పైగా గడిచినా, ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దశలోని అంశాలను తెరపైకి తెచ్చి చంద్రబాబుపై ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ లెక్కలున్నాయని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఈ రాజకీయ ఆరోపణలు మరింత తీవ్రంగా మారాయి. జగన్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆధారాలతో వెల్లడించినప్పటికీ, ఆ విషయం వైసీపీ అనుకూల మీడియాలో పెద్దగా ప్రతిబింబించలేదని టీడీపీ నేతలు అంటున్నారు. అదే సమయంలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాయలసీమ లిఫ్ట్ నిలిచిపోయిందన్నట్లు బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు, వైసీపీ సృష్టించిన ఈ ఆరోపణలకు బీఆర్ఎస్ మీడియా కూడా దూరంగా ఉండటం, రెండు పార్టీల మధ్య మౌన సహకారం ఉందన్న అనుమానాలను మరింత బలపరుస్తోంది.
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే కేసీఆర్ పాలనలోనే పడినప్పటికీ, ఆ స్టేను ఎత్తివేయించేందుకు అప్పటి జగన్ ప్రభుత్వం సరైన ప్రయత్నాలు చేయలేదన్నది టీడీపీ వాదన. ప్రాజెక్టు పనులు నిలిచిపోయి, మట్టి పనులు చేసి వదిలేయడమే సీమ అభివృద్ధి కాదని, ఇది రాయలసీమ ప్రజలకు అన్యాయం అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, రాయలసీమకు జీవనాధారంగా మారే నీటి ప్రాజెక్టులపై రాజకీయాలు జరుగుతున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇక, ఏటా సముద్రంలో వృథాగా పోతున్న గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, వైసీపీ మాత్రం మౌనంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. రాయలసీమకు కీలకమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు వైసీపీ పరోక్ష మద్దతు ఇస్తోందన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. చంద్రబాబు పాలనలో గోదావరి జలాలు సీమకు చేరితే, వైసీపీ రాజకీయ భవిష్యత్తుకు నష్టం జరుగుతుందన్న భయమే ఈ మౌనానికి కారణమని కూటమి నేతలు విమర్శిస్తున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలకన్నా రాజకీయ లాభనష్టాలకే ప్రాధాన్యం ఇస్తూ, కీలక నీటి ప్రాజెక్టుల విషయంలో మౌనం పాటించడం రాయలసీమకు ద్రోహమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో, జగన్‌ను ‘కేసీఆర్ వదిలిన బాణం’గా అభివర్ణించడం ఎంతవరకు సమంజసమన్నది ఇప్పుడు ప్రజా చర్చగా మారింది. చివరికి, ఈ రాజకీయ ఆరోపణలు, నీటి వివాదాల వెనుక ఉన్న నిజానిజాలను తేల్చేది ఆంధ్రప్రదేశ్ ప్రజలేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
KCR-Jagan Water Politics Sparks Fresh Debate in Andhra Pradesh
