తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీయార్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకి బెయిలొచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుమారు ఆరు నెలల క్రితం కవిత అరెస్ట్ అవడం, అప్పటినుంచీ ఆమె బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నించి విఫలమవడం తెలిసిన విషయాలే.
ఎన్నికలకు ముందర అరెస్ట్ అయిన కవితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అలాగే లోక్ సభ ఎన్నికల సమయంలోనూ పార్టీకి అందుబాటులో లేకుండా పోయారు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా, కేజ్రీవాల్ మంత్రి వర్గ సహచరుడు మనీష్ సిసోడియా కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే.
కాగా, సర్వోన్నత న్యాయస్థానం తాజాగా పది లక్షల పూచీకత్తుపై కవితకు బెయిల్ ఇస్తూ తీర్పు వెల్లడించింది. సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని కవితకు స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం.
ఢిల్లీ నుంచి కవితను హైద్రాబాద్ తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. అక్రమంగా కవితను అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ నేతలు గత కొన్నాళ్ళుగా విమర్శిస్తున్నారు. మరోపక్క, కవిత బెయిల్ ఊహించిందేననీ, బీజేపీలో బీఆర్ఎస్ విలీనమొక్కటే మిగిలి వుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం దిశగా కేసీయార్ రాయబారం నడుపుతున్నారనీ, కుమార్తె బెయిల్ కోసం బీజేపీ దగ్గర బీఆర్ఎస్ పార్టీని కేసీయార్ అమ్మకానికి పెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.
బీజేపీ – బీఆర్ఎస్ విలీనమని కాంగ్రెస్ ఆరోపించడం, కాంగ్రెస్ – బీఆర్ఎస్ విలీనమని బీజేపీ ఆరోపించడం గత కొంతకాలంగా జరుగుతూనే వుందనుకోండి.. అది వేరే సంగతి.
తెలంగాణ జాగృతి పేరుతో ఓ సంస్థని ఏర్పాటు చేసి, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు కవిత. గతంలో ఆమె బీఆర్ఎస్ నుంచి ఎంపీగా లోక్ సభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఓసారి ఓటమిని చవిచూశారు. అనంతరం ఆమెకు ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ నుంచి అవకాశం దక్కింది.