స్టార్ హీరో కార్తి నటిస్తున్న ‘అన్నగారు వస్తారు’ ఈ నెల 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందించారు. యాక్షన్, కామెడీ, ఫాంటసీ మూడ్‌ల కలయికగా వస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టీ నటిస్తోంది. విడుదలకు ముందుగా మీడియాతో మాట్లాడుతూ కార్తి ఈ సినిమాపై, తన పాత్రపై ఆసక్తికర వివరాలు పంచుకున్నారు.
కార్తి మాట్లాడుతూ, దర్శకుడు నలన్ కుమారస్వామి విజన్ తనను ఈ సినిమా చేయడానికి ప్రేరేపించిందని అన్నారు. “సూదు కవ్వమ్ తర్వాత నలన్ చేస్తున్న సినిమా కావడంతోనే ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది. 80ల మాస్ కమర్షియల్ మేనియాను ఆధునికంగా చూపించే ప్రయోగం ఇది. మన సంస్కృతిలో ఎన్టీఆర్, ఎంజీఆర్‌లాంటి సూపర్ హీరోలు ఉన్నారు. అలాంటి ఆరా ఉన్న హీరో తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనేది కథలోని ఆసక్తి” అని చెప్పారు.
ఈ కథ తనకు ఒక రిస్కీ, ఛాలెంజ్ ఉన్న ప్రయోగమని కార్తి అన్నారు. “ఊపిరి లాంటి సినిమాలు ఈజీగా చేయగలను. కానీ ఇది నాకు కొత్త అనుభవం. రైటర్స్‌కు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కొత్త తరహా సినిమాలు పుడతాయి. నలన్ ఈ కథను అవెంజర్స్ స్థాయి విజువల్స్, సంగీతంతో విభిన్నంగా ప్రెజెంట్ చేశాడు” అని పేర్కొన్నారు.
కథ నిర్మాణం గురించి మాట్లాడిన కార్తి, “మన దగ్గరే ఉన్న హీరో, విలన్, పాటలు, ఫైట్స్ అనే కమర్షియల్ స్ట్రక్చర్‌ను ప్రపంచం ఎక్కడా చూడం. దానికే మోడరన్ టచ్ ఇచ్చాం. ఇది పీరియడ్ మూవీ కాదు. కానీ 80, 90ల ఫీల్‌ను గుర్తుచేసే ఎనర్జీ మొత్తం సినిమాలో ఉంటుంది” అని అన్నారు.
తానిప్పటివరకు చేసిన పోలీస్ పాత్రలకంటే పూర్తిగా భిన్నంగా, ప్యారలల్ వరల్డ్‌లో జరిగే ఈ కథలో తన పోలీస్ ఆఫీసర్ పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు. “సఫారీ డ్రెస్ వేసుకుని జడ్జికి చెప్పే సీన్ ట్రైలర్‌లో చూసే ఉంటారు. అలాంటి కొత్త ఐడియాలు నలన్ స్పెషాలిటీ. మ్యూజిక్ కూడా రిథమ్‌తో ఉంటుంది” అన్నారు.
హీరోయిన్ కృతి శెట్టి నటనను ప్రశంసించిన కార్తి, “స్పిరిట్ రీడర్ పాత్ర కోసం ఆమె చేసిన ప్రిపరేషన్ అద్భుతం. గ్లామర్ మాత్రమే కాదు, మంచి నటి అవ్వాలి అనే ఉన్న పట్టుదల కృతిశెట్టీలో కనిపిస్తుంది” అన్నారు. సంతోష్ నారాయణన్ స్వయంగా ఈ సినిమాలో పనిచేయాలని ముందుకొచ్చారని, దాంతో సినిమాకు మరిన్ని లేయర్స్ వచ్చాయని కార్తి వెల్లడించారు.
టీమ్‌వర్క్‌పై తన నమ్మకం గురించి మాట్లాడిన కార్తి, షూటింగ్‌లో సన్నివేశాలకు సంబంధించిన చర్చల్లో ఎప్పుడూ పాల్గొంటానని చెప్పారు. “నాకు వచ్చిన ఆలోచనలు చెప్తాను. నేను పాత్రలో ఉండేలా మాట్లాడితే ఎలా ఉంటుదో ఒక ఐడియా వస్తుంది. నిర్మాత జ్ఞానవేల్ రాజా పూర్తి స్వేచ్ఛ ఇచ్చి కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి అన్ని సపోర్ట్ చేశారు” అన్నారు.
కొత్త సినిమాలు చేసేవారికి ప్రేక్షకుల ప్రోత్సాహం అవసరమని కార్తి అభిప్రాయపడ్డారు. “ఎవరైనా కొత్తదనం ట్రై చేస్తే మనం ప్రోత్సహించాలి. లేకపోతే ఎవరూ కొత్తదనం వైపు వెళ్లరు. అఖండ 2 కోసం నేను కూడా అభిమానుల్లానే ఎదురుచూస్తున్నా. కె. విశ్వనాథ్ గారి సినిమాలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం” అని అన్నారు.
