Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కాకపోతే, కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడే బలమైన నాయకుడు ఇంకెవరైనా వున్నారా.? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న ప్రశ్న ఇది.! ‘నేను కాపు సామాజిక వర్గంలో పుట్టాను. అన్ని సామాజిక వర్గాల్నీ గౌరవిస్తాను. కాపు సామాజిక వర్గం పెద్దన్న పాత్ర పోషించాలి.. అందర్నీ కలుపుకుపోవాలి..’ అని పదే పదే పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. ‘కులాల్ని కలిపే రాజకీయం.. అదే జనసేన నినాదం’ అంటోంది జనసేన పార్టీ. కానీ, దీనికి వక్రభాష్యాలు చెబుతోంది అధికార వైసీపీ. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్, ‘కాపు సామాజిక వర్గాన్ని’ ప్రస్తావిస్తూ, ఏ వ్యాఖ్య చేసినా వెంటనే వక్రీకరణకు గురవుతోంది. వైసీపీ పేటీఎం బ్యాచ్, సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేత మీద చిమ్ముతున్న విషం అంతా ఇంతా కాదు.
పవన్ కళ్యాణ్ తండ్రి విషయంలో కావొచ్చు, వంగవీటి మోహన రంగా విషయంలో కావొచ్చు.. మరో విషయంలో కావొచ్చు.. జనసేనాని మీద వైసీపీ చేసే ట్రోలింగ్, కాపు సామాజిక వర్గంలో అలజడికి కారణమవుతూ వస్తోంది. ‘పవన్ కళ్యాణ్ గనుక రాజకీయాల్లో లేకపోతే, అసలు కాపు సామాజిక వర్గం గురించి ఇంతలా చర్చ జరిగేది కాదు. రంగా ప్రస్తావన ఇంతలా వచ్చి వుండేది కాదు..’ అంటోంది కాపు యువత.
‘బతికున్నప్పుడు రంగాని కాపాడుకోలేకపోయాం.. ఆయన చనిపోయాక విగ్రహాలు పెడుతున్నాం..’ అని జనసేనాని చెబుతున్న మాటలు కాపు యువత మనసుల్ని నేరుగా తాకుతున్నాయి. ‘ఇప్పుడు జనసేనానిని కాపాడుకోకపోతే, ముందు ముందు బాధపడతాం..’ అన్న చర్చ కాపు సామాజిక వర్గంలో బలంగా జరుగుతోంది.
అది తట్టుకోలేకపోతున్న వైసీపీ, ‘చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడు’ అనే పసలేని విమర్శని మరింత గట్టిగా చేసేందుకు ప్రయత్నిస్తూ బొక్కబోర్లా పడుతోంది. వైసీపీలో పేర్ని నాని లాంటి నాయకుల్లో కూడా ఈ విషయమై స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ‘వారాహి’ విషయంలో గుడివాడ అమర్నాథ్ కావొచ్చు, పేర్ని నాని కావొచ్చు.. ఎలా మాట మార్చారో చూశాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత, వైసీపీలో కాపు నాయకులు.. ‘పరివర్తన’ చెందక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాపు సామాజిక వర్గం పెద్దన్న పాత్ర పోషించడమంటే, జనసేన అధికారంలోకి రావడమేనన్న చర్చ అంతటా జరుగుతోందిప్పుడు.