తాము కన్నప్ప మూవీని తీయడం శివుడి ఆజ్ఞ అని మంచు మోహన్ బాబు, విష్ణు అన్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ జూన్ 27న రిలీజ్ కాబోతోంది. మోహన్ బాబు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మించగా.. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
ఇందులో మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘నేను జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే నాకు భయం లేదు. నా పిల్లలకు అదే నేర్పించా. నా విద్యాలయాల్లో చదువుతున్న స్టూడెంట్లకు కూడా అదే నేర్పిస్తున్నాను. నా తల్లికి చిన్నప్పటి నుంచే చెవులు వినిపించేవి కాదు. ఆమె నా గొంతు వింటే ఎంత బాగుండు అని ఎన్నో సార్లు అనుకున్నాను. ఇప్పుడు కన్నప్ప మూవీని చూస్తే నాకు నా తల్లి గుర్తుకు వస్తోంది. నా జీవితంలో ఆమెనే నాకు నిజమైన కన్నప్ప. నా బిడ్డ విష్ణు మూవీని చాలా కష్టపడి తీశాడు. దాదాపు ఎనిమిది సంవత్సరాలు మూవీని కష్టపడి తీశాం. విష్ణు కష్టం మీకు సినిమాలో కనిపిస్తుంది. మూవీ చాలా బాగా వచ్చింది.
నా కంటే చిన్నవాడైన ప్రభాస్ కు నేను థాంక్స్ చెప్పాలి. నేను బావ అని పిలుస్తుంటాను. అతన్ని నేను ఇలా పాత్ర చేయాలి అని అడగ్గానే ఒప్పుకున్నాడు. మా మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. మానవత్వం, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా ఉన్న టాప్ హీరోలలో ప్రభాస్ ఒకడు. మోహన్ లాల్ నేను అడగ్గానే ఒప్పుకున్నాడు. బ్రహ్మానందం, శరత్ కుమార్ లాంటి వారు కూడా ఈ సినిమాలో నటించారంటే అంతా ఆ ఈశ్వరుడి మాయలా అనిపిస్తోంది. మూవీ నాకు చాలా ముఖ్యమైనది. అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు.
విష్ణు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గురించి ముందుగా మా నాన్నకు థాంక్స్ చెప్పాలి. ఆయన లేకపోతే ఈ మూవీ ఇంత బాగా వచ్చేది కాదు. ఆయన వెనకుండి మమ్మల్ని నడిపించారు. బ్రహ్మానందం గారు మొదటి నుంచి మాకు ధైర్యం ఇస్తున్నారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ డబ్బుల కోసం చేయలేదు. ఈ సినిమా మీద ఉన్న ప్రేమతో చేశారు. ప్రభుదేవా ఒక కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, డైరెక్టర్‌గా సక్సెస్ చూసారు. ఆయన పనులన్నీ పక్కన పెట్టి మూవీని చేశారు. ముఖేష్ కుమార్ సింగ్ కు మన భాష రాకున్నా.. అడిగిన వెంటనే ఒప్పుకున్నారు. ప్రభాస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అతను నాకు ఆప్తమిత్రుడు. మోహన్ లాల్ గారు గొప్ప నటుడు. అతను ఈ సినిమా కోసం చేస్తారని అనుకోలేదు. మా నాన్న గారికోసమే ప్రభాస్, మోహన్ లాల్ ఈ సినిమాలో చేశారు. వారిని ఎన్నటికీ గుర్తు పెట్టుకుంటాను. వారంతా ఈ మూవీలో నటించడం శివుడి కోరిక అనిపిస్తోంది. ఈ మూవీకోసం ఎంతో కష్టపడ్డాం. అందరూ ఆశీర్వదించి మూవీని చూడండి’ అని కోరారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప మూవీ అనేది చాలా అరుదైనది. ఇలాంటి సినిమాలో నటించడం ఒక అనుభూతి. ఈ మూవీ గ్రాఫిక్స్, వీఎఫ్ ఎక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాతగా, హీరోగా విష్ణు కష్టాన్ని దగ్గరుండి చూశాను. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించారు. ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో మళ్లీ రావు. అందరూ మూవీని ఆదరించండి’ అని కోరారు.

