తమిళ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక పిరియాడికల్, యాక్షన్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ సినిమా నిర్మించారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సినిమా ట్రైలర్ విడుదల చేసింది టీమ్.
వెయ్యిళ్ల క్రితం ఐదు తెగలు, ప్రస్తుత కాలం మధ్య సాగే కథ. భారీ పోరాటాలు చేసే కంగువ, ప్రస్తుత జనరేషన్ హీరోను చూపిస్తూ ట్రైలర్ ఉంది. వెయ్యేళ్ల కిందట కంగువ ఇచ్చిన మాట.. దానిని ఈనాటి హీరో ఎలా నిలబెట్టాడనేది కథ. వీరుడి ప్రతిజ్ఞ ఏంటి ? అతన్ని మోసం చేసిందెవరు? వీరుడు పునర్జన్మ ఎత్తాడా?, అతను నిలబెట్టిన గౌరవం ఎలాంటిది? అనే అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంది. రెండు విభిన్నమైన పాత్రల్లో.. వెయ్యేళ్లనాటి వ్యక్తిగా, స్టైలిష్ హీరోగా రెండు పాత్రల్లో నటించారు సూర్య.