ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కాకినాడ పోర్టు హాట్ టాపిక్ అయింది. అదేంటో గానీ పవన్ ఏం చేసినా సరే దాని చుట్టూ చాలా వ్యవహారాలు బయట పడుతున్నాయి. ఇప్పుడు ఆయన కాకినాడ పోర్టుకు వెళ్లి సీజ్ ద షిప్ అనే ఒక్క డైలాగ్ చెప్పడం నుంచి మొదలైన వ్యవహారం.. ఏకంగా కాకినాడ పోర్టు వాటాల కేసుల దాకా వెళ్లింది. కేవలం బియ్యం అక్రమ సరఫరా అనుకుంటే.. అసలు పోర్టులో వాటాలు తెరమీదకు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టులో తన వంతు 40 శాతం వాటాలను బెదిరించి రాయించుకున్నారని హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ కర్నాటి వెంకటేశ్వర్ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు.
కాకినాడ సీ పోర్టు నిర్వహిస్తున్న తనను అక్రమ కేసులు పెడుతామని వైసీపీ నేతలు బెదిరించారని చెబుతున్నారు. అలా బెదిరించి తనకున్న రూ.2500 కోట్ల విలువైన కాకినాడ పోర్టు వాటాలను కేవలం రూ.494 కోట్లకు, రూ.1109 కోట్ల విలువైన సెజ్ ను రూ.12కోట్లకే అరబిందో సంస్థ పేరు మీదకు బదిలీ చేయించారని ఆరోపిస్తున్నారు. ఇందులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మరో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో అధినేత పెనాక శరత్ చంద్రారెడ్డితో పాటు మరికొందరి పేర్లను ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో వారందరూ దేశం వదిలి పారిపోకుండా సీఐడీ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది.
చూస్తుంటే త్వరలోనే వీరిని విచారించి, అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. మొత్తంగా జగన్ మెడకు మరో ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో జగన్ ప్రమేయం కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీగా సింపతీ పొందాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఏదో ఒక కేసు జగన్ ను వెంటాడుతోంది. తిరుపతి లడ్డూ, ఆ తర్వాత చెల్లెలు షర్మిలతో వివాదం.. ఇప్పుడు ఏకంగా జాతీయ స్థాయిలో అతిపెద్ద స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఇది జగన్ కు మరో భారీ దెబ్బ అనే చెప్పుకోవాలి.